హైదరాబాద్‌లో భారీ అల్లర్లకు కుట్ర: కేసీఆర్

by  |
హైదరాబాద్‌లో భారీ అల్లర్లకు కుట్ర: కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని సీఎం కేసీఆర్ పోలీసులను అప్రమత్తం చేశారు. నిరాశ, నిస్పృహల్లో ఉన్న కొన్ని అరాచక శక్తులు కుట్రలు చేస్తున్నాయన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారి పై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అరాచక శక్తుల కుట్ర పై ప్రభుత్వం వద్ద కచ్చితమైన సమాచారం ఉందన్నారు. బుధవారం రాష్ట్ర డీజీపీ, ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో గొడవలు రాజేసి హైదరాబాద్‌కు విస్తరించేందుకు ప్లాన్ చేశారని ఏకంగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటమే అంత్యంత ప్రధానమని కేసీఆర్ చెప్పారు. సంఘ విద్రోహ శక్తులను అణచివేసేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రకటించారు. సామరస్యాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారని.. అటువంటి వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలను అడ్డుగా పెట్టుకొని కుట్రలు చేస్తున్నారని.. ఎన్నికలను వాయిదా వేసేందుకు కూడా ప్రయత్నాలు జరుతున్నాయని కేసీఆర్ చెప్పారు. మొదటగా సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని తప్పుడు ప్రచారం చేశారని సీఎం ఆరోపించారు. మార్ఫింగ్ ఫోటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారన్నారు. మాటలతోనే కవ్వింపు చర్యలకు పూనుకున్నారన్నారు. ముఖ్యంగా ప్రార్థన మందిరాల వద్ద వికృత చేష్టలు చేయాలని చూస్తున్నారన్నారు. శాంతికాముకులైన హైదరాబాద్ ప్రజలు అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ తెలిపారు.


Next Story