గెలిపించే బాధ్యత నాదే.. గులాబీ నేతలతో కేసీఆర్ కీలక మంతనాలు

by  |
గెలిపించే బాధ్యత నాదే.. గులాబీ నేతలతో కేసీఆర్ కీలక మంతనాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రం తెలంగాణ రైతాంగంపై అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై ఈ నెల 20న గ్రామ గ్రామానా చావుడప్పు వేయడంతోపాటు నిరసన, ధర్నా, కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మల శవయాత్ర నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపు నిచ్చారు. తాము రైతుల పక్షమే అని, వారి సంక్షేమం కోసమే రైతుబంధు, బీమా, 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. రైతులందరికీ రైతుబంధు ఇస్తామని.. దళిత బంధును ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్రం విధానాలను, తెలంగాణలో బీజేపీ నేతలు అనుసరిస్తున్న తీరును ఎండగట్టాలన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, డీసీసీబీ అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా సమస్యలు, పార్టీ పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలతో వన్ టు వన్ నిర్వహించారు. కొన్ని జిల్లాల్లో మంత్రులు ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని చెప్పడంతో సీఎం సీరియస్ అయ్యారు. అందరూ సమానమేనని అందరిని కలుపుకొని పోవాల్సిన బాధ్యత మంత్రులపై ఉందన్నారు. పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కేంద్రం ధాన్యం కొనుగోళ్లపై, రైతు వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకుగా పని చేయాలన్నారు. అలా చేస్తే మళ్లీ గెలిపించే బాధ్యత తనదేనని చెప్పారు. ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వబోమని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని, చురుకుగా పనిచేయాలని సూచించారు. యాసంగిలో సాగు చేస్తే రైతు బంధు రాదనే అపోహలు నమ్మొద్దని, అందరికీ అందజేస్తామని స్పష్టం చేశారు. పంటల మార్పిడిపై రైతు వేదికల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్య పర్చాలని సూచించారు. మిల్లర్లతో ఒప్పందం ఉన్నవారు వరి వేసుకోవచ్చని స్పష్టం చేశారు. రైతులంతా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కోరారు. కోతులు, అడవి పందుల బెడద నివారణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రత్నామ్యాయ పంటల ప్రోత్సాహకానికి సబ్సిడీలతో పాటు డ్రిప్‌లు, స్ర్పింకర్లు అందజేస్తామని వెల్లడించారు.

రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్నీ రైతులకు వివరించాలన్నారు. దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఆపే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. హుజూరాబాద్‌లో ఇప్పటికే దళితులు ఖాతాల్లో డబ్బులు జమచేశామని, మిగతావారికి కూడా వేస్తామన్నారు. మొదట ప్రతీ నియోజకవర్గంలో వంద మందికి ఇస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్‌లో దళితబంధుకు నిధులు పెంచనున్నట్లు తెలిపారు. ‘నాయకులకు ఓపిక ఉండాలి.. పార్టీ కోసం కష్టపడ్డోళ్లకు పదవులు వస్తాయి.. నల్లగొండ జిల్లాకు చెందిన కోటిరెడ్డి ఓపిక పట్టిండు.. ఇయ్యాల ఎమ్మెల్సీ అయ్యిండు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని.. ఎవరూ నారాజ్ కావొద్దని సూచించారు. పార్టీ చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

శనివారం కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర విధానాలను ఎండగట్టాలని సూచించారు. నిత్యం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉండాలని ఆదేశించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఊరూరా కోటి సంతకాల సేకరణ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. దేశంలో ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు అని, జాతీయపార్టీలది కాదని సీఎం స్పష్టం చేశారు. జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకోవాల్సిందేనన్నారు.

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత పార్టీ కమిటీలు, ప్రజాప్రతినిధులదే అన్నారు. తమిళనాడులో డీఎంకే మూడు తరాలుగా అధికారంలోకి వస్తుందని.. ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీకార్యకర్తల బలోపేతంలోనే సాధ్యమైందని.. అదే విధంగా రాష్ట్రంలో పార్టీని నిర్మాణం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. పీఎం మోడీ కాశీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇతరపార్టీలపై వ్యాఖ్యలను చేయడం సబబు కాదని పేర్కొన్నట్టు తెలిసింది.

నేడు ఢిల్లీకి మంత్రులు, ఎంపీల బృందం

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై అమీతుమీ తేల్చుకునేందుకు మరోసారి మంత్రులు, ఎంపీల బృందం శనివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనుంది. ఆ బృందంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, గుంటకండ్ల జగదీశ్​రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ లతో పాటు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. కేంద్ర మంత్రితోపాటు పీఎం అపాయింట్‌మెంట్ తీసుకొని కలువనుంది. వినతిపత్రాలు అందజేయడంతోపాటు తెలంగాణ రైతాంగం పడుతున్న ఇబ్బందులను వివరించనున్నారు. కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా తీసుకునే టార్గెట్ ను పెంచాలని కోరనున్నారు. సీఎం కేసీఆర్ ఈనెల 19 నుంచి చేపట్టనున్న జిల్లాల పర్యటన తాత్కాలికంగా వాయిదాపడింది. కేంద్రంపై గ్రామస్థాయిలో కార్యచరణ చేపట్టడంతో జిల్లా పర్యటన వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 23న వనపర్తి, 24న జనగామ జిల్లాలో పర్యటిస్తారని సమాచారం. అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించినట్లు సమాచారం.

మంత్రి హరీశ్​రావు గైర్హాజరు..

పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి హరీశ్ రావు హాజరు కాలేదు. మధ్యాహ్నం వరకు ప్రగతి భవన్ లో ఉన్న ఆయన సమావేశానికి రాకపోవడం చర్చనీయాశంగా మారింది. మంత్రిని పార్టీకి దూరం చేశారా? ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా? అనేది హాట్ టాఫిక్ గా మారింది. అయితే మంత్రి హరీశ్‌రావు ఫుడ్ పాయిజన్ సమస్యతో బాధపడుతున్నందున ఆస్పత్రికి వెళ్ళినట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. సీఎం కేసీఆర్‌కు ఈ విషయాన్ని అర్థం చేయించి డాక్టర్లకు చూపించుకునే నిమిత్తం మధ్యాహ్నానికే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినట్టు వివరించారు. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతకు మించి వేరే కారణం లేదని ఆయన సన్నిహితులు వివరించారు.


Next Story

Most Viewed