టీఆర్ఎస్‌లో అంతర్మథనం మొదలైంది..!

by  |
టీఆర్ఎస్‌లో అంతర్మథనం మొదలైంది..!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: గ్రేటర్ ఫలితాలతో టీఆర్ఎస్‎లో అంతర్మథనం మొదలైంది. అసలు ఎందుకిలా జరిగింది ? బీజేపీకి కలిసొచ్చిన అంశాలేమిటి? తదితర ప్రశ్నలు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దుబ్బాక ఫలితం పార్టీకి వ్యతిరేకంగా రావడంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఫిబ్రవరి తర్వాతనే ఉంటాయని అంతా ఊహించారు. చివరకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కేవలం రెండు వారాల వ్యవధితో ఎన్నికలు పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ జారీ చేసింది. ‘తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా’ ప్రభుత్వం ఎన్నికలకు పోయి బీజేపీ చేతిలో దారుణంగా దెబ్బతింది.

పనిచేయని చరిష్మా..

దుబ్బాక ఉప ఎన్నికకు ముందు టీఆర్ఎస్‌ను ప్రజలు విశ్వసిస్తున్నారనే నమ్మకం ఆ పార్టీ నాయకుల్లో ఉండేది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఎప్పుడు, ఏ ఎన్నికలొచ్చినా ఓట్లు రాబట్టుకునే శక్తి, సామర్థ్యం ఉందని అందరూ నమ్మేవారు. ఐతే దుబ్బాక ఫలితం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రావడంతో అధిష్ఠానం మరో రకంగా ఆలోచించి ఉండవచ్చని సొంత పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి లో గ్రేటర్ ఎన్నికలు జరిగితే బీజేపీ మరింత బలంగా ప్రజలలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని, ఇప్పుడైతే అంతగా ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుందనే చర్చ అంతటా జరుగుతోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల ప్రసంగాలకు ఓట్లు పడుతాయని భావించినప్పటికీ వారు కూడా ఓటరును ఆకర్షించలేకపోయారని, వారి చరిష్మా కూడా పని చేయలేదని పలువురు నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

కొంప ముంచిన సిట్టింగ్..

గ్రేటర్ ఎన్నికల్లో అధిక శాతం డివిజన్లు సిట్టింగ్‌ల చేతిలో పెట్టడమే పార్టీ ఓటమికి కారణంగా కనబడుతోంది. సిట్టింగ్ అభ్యర్థుల్లో చాలా మందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా అది గుర్తించకుండా పార్టీ అధిష్ఠానం టికెట్లు తిరిగి కేటాయించడం మొదటికే మోసమైందని, ఉద్యమ కాలం నుంచి పని చేస్తున్న సీనియర్ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. ఎంత మేధావైనా ఏదో ఒక తప్పు చేస్తారనే విధంగా సీఎం కేసీఆర్ వెనకా ముందు చూడకుండా అధిక శాతం టికెట్లు కేటాయించడమే సీట్లు తగ్గడానికి కారణమని పేర్కొనడం గమనార్హం.

2016 ఎన్నికల్లో విజయం సాధించిన 99 మంది అప్పట్లో పార్టీ వేవ్‌లో గెలిచారని గుర్తించకుండా, వారిలో కొంత మంది గెలిచే అవకాశం లేదనే సాకుతో పక్కన పెట్టారు. సీట్లు దక్కించుకున్న సిట్టింగ్ లపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో కేవలం 56 మంది మాత్రమే విజయం సాధించారు. దీంతో మేయర్ పీఠం ఎలా దక్కించుకోవాలనే స్థితికి పార్టీ పడిపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 2018 లో ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి రెండవ పర్యాయం ఘన విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పార్టీ అధిష్ఠానం అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే అధిక శాతం సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చి బల్దియా పీఠం దక్కించుకునే ప్రయత్నం చేసి దారుణ ఓటమిని మూటగట్టుకుంది.

నోటాకు బదులుగా బీజేపీకి ఓట్లు..

మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ప్రతీరోజు రోడ్ షోలు నిర్వహించారు. టీఆర్ఎస్‌కు ఓటు వేయకపోతే ఇతర పార్టీలకు వేయరాదని, నోటాకు వేయాలని సూచించారు. దీనికి తోడు సీఎం కేసీఆర్ కూడా ఎల్బీ స్టేడియంలో మాట్లాడుతూ గంట గంటకు ట్రెండ్ మారుతుందన్నారు. ఈ రెండు సందర్భాలను బీజేపీ నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. గ్రేటర్ ఎన్నికలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఓటమిని అంగీకరించేలా మాట్లాడారని, కానీ, బీజేపీ మాత్రం కమలానికి ఓట్లు వేయాలని విజ్ఞప్తులు చేసింది. దీంతో ప్రజలు ట్రెండ్ మార్చి నోటాకు బదులుగా కమలానికి ఓట్లు వేశారనే గుస గుసలు పార్టీ నాయకుల నోట వినిపిస్తున్నాయి.


Next Story