కరీంనగర్‌లో బల్దియా ‘కొట్లాట’?

by  |
కరీంనగర్‌లో బల్దియా ‘కొట్లాట’?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: నగరాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమగ్రంగా చర్చించి, వాటిని పరిష్కరించేందుకు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా.. రసాభసాగా మారుతున్నాయి. మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండాల్సిన కార్పొరేషన్ సమావేశాలు గొడవలతో జరుగుతుండడంతో విమర్శలకు తావిస్తోంది. కొత్త పాలక వర్గాలు కొలువుదీరి ఏడాది గడిచినా కరోనా మహమ్మారి కారణంగా రెండు సమావేశాలు మాత్రమే జరిగాయి. అయితే ఈ రెండు సమావేశాలు కూడా అధికార, విపక్ష సభ్యుల పంచాయితీలకు వేదికగా మారాయి. కొత్తగా కొలువుదీరిన పాలకవర్గం ఆయా డివిజనల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి కానీ ఇతరత్రా ప్రజలకు ఉపయోగపడే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం కన్నా పంచాయతీలతో కాలయాపన చేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఆరోపణలపై అటాక్!

ప్రతిపక్ష సభ్యులు ఆరోపణలు చేసినప్పుడు సమాధానం ఇవ్వాల్సిన అధికార పక్షం అటాకింగ్ ధోరణిలో వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అంశాలను లేవనెత్తుతున్న ప్రతిపక్ష సభ్యులు క్రీయాశీల పాత్ర పోషించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్‌లో సాదాసీదాగా సమావేశాలు జరిగాయా అనే చర్చ కూడా మొదలైందంటే పరిస్థితి ఎంతలా మారిందో అర్థం చేసుకోవచ్చు. వందల సంఖ్యలో ఉండే ఎజెండా అంశాలపై చర్చించకుండా ఏదో ఒక అంశాన్ని ప్రధానాస్త్రంగా తీసుకుని ఆందోళన చేస్తున్నారు. బల్దియాలో సంపూర్ణ మెజార్టీ ఉన్న అధికార పార్టీ ఏజెండా అంశాలను ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాయి. దీంతో అసలు ఆయా చోట్ల ఏయే ప్రాంతాలకు ఏమేం ఖర్చు చేస్తున్నారు? ఏఏ అవసరాలకు నిధులు కేటాయిస్తున్నారు? ప్రజావసరాలేంటి అన్న విషయాలపై చర్చ జరిగే పరిస్థితే లేకుండా పోయింది. తాజాగా బుధవారం జరిగిన కరీంనగర్ కార్పొరేషన్ మీటింగ్ లో కూడా ఇదే తంతు జరగడం విస్మయం కలిగిస్తోంది.

బీజేపీ సెల్ఫ్ గోల్..?

బీజేపీ కార్పొరేటర్ మర్రి భావన మీటింగ్ ప్రారంభం అయిన వెంటనే నిరసనకు పూనుకున్నారు. తన డివిజన్ లో బల్దియా ఆధ్వర్యంలో నాటిన మొక్కలు అన్ని ఎండిపోయాయంటూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కార్పొరేటర్ ఎండిపోయిన మొక్కలకు చెందిన కట్టెలను కూడా సమావేశానికి తీసుకొచ్చి బల్దియా నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు. దీంతో టీఆర్ఎస్ సభ్యులు కౌంటర్ అటాక్ చేశారు. అయితే కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం మొక్కల పెంపకం బాధ్యత సంబంధిత కార్పొరేటర్లకే ఉంటుందన్న విషయాన్ని బీజేపీ నాయకులు మర్చిపోయినట్లు ఉన్నారు. వారి పరిధిలో 80 శాతం మొక్కలు ఎండిపోతే సంబంధిత ప్రజాప్రతినిధితో పాటు ఆ ఏరియాకు ఇన్‌చార్జిగా వ్యవహరించే అధికారిని కూడా బాధ్యుల్ని చేస్తామని కొత్త మున్సిపల్ చట్టం స్పష్టం చేస్తోంది. బీజేపీ కార్పొరేటర్ భావన మొక్కలు ఎండిపోయాయని స్వయంగా చెప్తున్నందున అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనే చర్చ సాగుతోంది.

ప్రచారం కోసం కాకూడదు..

కీలక నిర్ణయాలు తీసుకుని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రచారానికి ప్రాధాన్య ఇస్తున్నట్లుగా వ్యవహరిస్తుండడం సరికాదు. సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టే పనులపై పూర్తిస్థాయిలో చర్చించి వాటిలో లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు పాలకవర్గ సమావేశాలు వేదికగా నిలిస్తే బాగుంటుంది. -ఎన్ శ్రీనివాస్, లోక్ సత్తా ఉద్యమ సంస్థ అధ్యక్షుడు


Next Story