స్టార్ హీరోలు చేసే రొమాన్స్‌పై లేని అభ్యంతరం.. హీరోయిన్స్ విషయంలో ఎందుకు? నటి సెన్సేషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

సినిమాల్లో పెద్ద హీరోలు తమకంటే సగం వయసున్న చిన్న అమ్మాయిలతో జోడీ కట్టి రొమాన్స్ చేస్తుంటారు. అది అందరికీ చాలా నార్మల్‌గా అనిపిస్తుంది.

స్టార్ హీరోలు చేసే రొమాన్స్‌పై లేని అభ్యంతరం.. హీరోయిన్స్ విషయంలో ఎందుకు?  నటి సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఇషా కొప్పికర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. హిందీ, తమిళ, కన్నడ, చిత్రాలతో పాటు తెలుగులో సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. అక్కినేని నాగార్జున నటించిన ‘చంద్రలేఖ’ మూవీతో టాలీవుడ్‌కు వచ్చిన ఆమె తన నటనతో, అందంతో మంచి మార్కులే కొట్టేశారు. ఆ తర్వాత ప్రేమతో రా, కేశవ వంటి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేశారు. అక్కడ వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇషా చివరగా.. 2024లో ‘అయలాన్’ కనిపించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ లేకపోవడంతో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా, ఇషా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సెన్సేషనల్ వీడియోను షేర్ చేశారు. సమాజంలోనూ, సినిమా ఇండస్ట్రీలోనూ ఆడవాళ్ల వయసు విషయంలో చూపిస్తున్న వివక్షపై మాట్లాడారు. ‘‘ఇది చాలా విచిత్రంగా ఉంది. ఒక మగాడికి వయసు పెరిగితే 'అతనికి అనుభవం వచ్చింది' అని అంటారు. అదే ఒక ఆడదానికి వయసు పెరిగితే అదొక సమస్య అన్నట్టు చూస్తారు.

సినిమాల్లో పెద్ద హీరోలు తమకంటే సగం వయసున్న చిన్న అమ్మాయిలతో జోడీ కట్టి రొమాన్స్ చేస్తుంటారు. అది అందరికీ చాలా నార్మల్‌గా అనిపిస్తుంది" అని ఇషా ఆవేదన వ్యక్తం చేశారు. అదే ఒక మహిళ ఈ వయసులో కూడా స్టైలిష్‌గా ఉంటూ, తన నచ్చినట్టు బ్రతికితే మాత్రం.. నీ వయసుకు తగ్గట్టు ఉండు అంటూ బుద్ధులు చెబుతారని ఆమె మండిపడ్డారు. వయసు పెరిగినంత మాత్రాన ఆడవాళ్ల విలువ తగ్గిపోదని, వాళ్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని ఇషా చెప్పారు. ఆడదాని అందం ముఖంలో కాదు, ఆమె జీవిత ప్రయాణంలో ఉంటుందని అన్నారు. ముఖంపై వచ్చే ముడతలు కేవలం వయసును మాత్రమే కాదు.. ఆమె జీవితంలో పడిన కష్టాలను, చేసిన పోరాటాలను చూపిస్తాయని పేర్కొన్నారు. కాబట్టి వయసు పెరగడాన్ని ఒక అవమానంగా చూడొద్దని అన్నారు. ఆడవాళ్ల చర్మాన్ని కాదు, వాళ్ల వెనకున్న శక్తిని గౌరవించాలని కోరారు. ఎందుకంటే ఆత్మగౌరవానికి డేట్ అయిపోవడం అంటూ ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story