Vadde Naveen: రీమేక్ అని సినిమా వద్దన్నాను.. కానీ నిర్మాత చేసిన పనికి ఒప్పుకోవాల్సి వచ్చింది

by Pulgam srinivas |

‘మనసిచ్చి చూడు’ రీమేక్ అని మొదట ఒప్పుకోలేదని, ఆ తర్వాత ఎడిటర్ మోహన్ గారి వల్ల అంగీకరించినట్లు వడ్డే నవీన్ తెలిపారు.

Vadde Naveen: రీమేక్ అని సినిమా వద్దన్నాను.. కానీ నిర్మాత చేసిన పనికి ఒప్పుకోవాల్సి వచ్చింది
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు వడ్డే నవీన్ తాజాగా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్న నేపథ్యంలో ఆయన వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వడ్డే నవీన్, తన కెరీర్‌లో గుర్తింపు తెచ్చిన ‘మనసిచ్చి చూడు’ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘మనసిచ్చి చూడు’ ఒక రీమేక్ చిత్రం అని, మొదట ఈ సినిమా కథను ఎడిటర్ మోహన్ తనకు చెప్పారని వెల్లడించారు. అయితే అది రీమేక్ సినిమా కావడంతో మొదట తాను చేయడానికి ఆసక్తి చూపలేదని తెలిపారు.

అనంతరం కొంత సమయం తీసుకున్న ఎడిటర్ మోహన్, ప్రత్యేకంగా సిద్ధం చేసిన స్క్రీన్‌ప్లేను తనకు వినిపించారని, అది బాగా నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించినట్లు వడ్డే నవీన్ చెప్పారు. అలాగే ఈ సినిమాలో ఒక పాటను రికార్డ్ చేసిన తర్వాత తొలగించామని, ఆ స్థానంలో మరింత ఉత్సాహభరితమైన ఫాస్ట్ బీట్ సాంగ్ ఉండాలని భావించి ‘సలాం మలేకుమ్’ పాటను చేర్చినట్లు ఆయన వెల్లడించారు. ‘మనసిచ్చి చూడు’ చిత్రంలో రాశి హీరోయిన్‌గా నటించగా, సుహాసిని, రవితేజ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఆర్. సురేష్ వర్మ దర్శకత్వం వహించారు. ఎంఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎడిటర్ మోహన్ సమర్పణలో ఈ సినిమా నిర్మితమైంది.

Next Story