‘వారి వ్యక్తిగత విషయాలు?’ విజయ్-త్రిష పుకార్లపై ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Naini |

సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ విజయ్-త్రిష పుకార్లపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు.

‘వారి వ్యక్తిగత విషయాలు?’ విజయ్-త్రిష పుకార్లపై ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్, ప్రముఖ నటి త్రిష చుట్టూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ కలిసి ఒక వివాహ వేడుకలో కనిపించారు. ఆ ఫోటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో, సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడుతూ, విజయ్-త్రిషల మధ్య ఉన్నది వారి వ్యక్తిగత విషయమని, దానిని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ‘వారి వ్యక్తిగత జీవితం గురించి ప్రజలకు ఎందుకు అంత ఆసక్తి? వారి పనులు సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేయనంత వరకు, మనం వాటి గురించి చర్చించాల్సిన పని లేదు. వారు తమ జీవితాన్ని ఎలా గడపాలో వారికే తెలుసు’ అని ఖుష్బూ పేర్కొన్నారు.

రాజకీయాలపై ప్రభావం..

తమిళనాడులో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో, విజయ్ కొత్తగా రాజకీయ పార్టీ (TVK) పెట్టి ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో ఈ పుకార్లు ఆయన ప్రతిష్టను దెబ్బతీస్తాయా? అని అడిగిన ప్రశ్నకు ఖుష్బూ సానుకూలంగా స్పందించారు. ఓటు వేసేటప్పుడు ప్రజలు చాలా స్పష్టంగా ఆలోచిస్తారని, నాయకుడి వ్యక్తిగత జీవితానికి, ఆయన చేసే ప్రజా సేవకు మధ్య తేడాను ప్రజలు గుర్తిస్తారని ఆమె అన్నారు. ‘ఆయన ఒక నేత కావొచ్చు, కానీ అంతకుమించి ఆయన మనలాంటి ఒక మనిషి. ఆయన వ్యక్తిగత జీవితంతో ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు’ అని ఆమె విజయ్‌కు మద్దతుగా నిలిచారు. కాగా, ఖుష్బూ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అసలేం జరిగిందంటే..?

గత కొన్ని రోజులుగా నటుడు విజయ్, భార్య సంగీత విడాకుల కేసు నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక వివాహ రిసెప్షన్‌లో విజయ్, త్రిష కలిసి వేదికపైకి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిద్దరూ జంటగా ఫోటోలకు ఫోజులివ్వడం నెట్టింట వైరల్ కావడంతో, వారి మధ్య ఏదో నడుస్తోందనే పుకార్లు మొదలయ్యాయి.

Next Story