టాలీవుడ్‌పై కన్నేసిన ‘తుడరుమ్’ దర్శకుడు

by Pulgam srinivas |   (  Updated:2026-05-10 11:46:25  IST  )

తుడరుమ్ చిత్ర దర్శకుడు తరుణ్ మూర్తి ఓ టాలీవుడ్ యువ హీరోతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌పై కన్నేసిన ‘తుడరుమ్’ దర్శకుడు
X

దిశ, వెబ్ డెస్క్: మలయాళంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుల్లో తరుణ్ మూర్తి ఒకరు. ఈయన కొంతకాలం క్రితం మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తుడరుమ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మలయాళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇదే టైటిల్‌తో తెలుగులో విడుదలైన ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని సాధించింది. దీంతో తరుణ్ మూర్తికి తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని ఓ టాలీవుడ్ హీరోతో చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ యువ హీరోకి కథను వినిపించగా, ఆ కథ అతనికి బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాత ఫైనల్ కాలేదని, ప్రొడ్యూసర్ ఓకే అయిన వెంటనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ‘తుడరుమ్’ లాంటి గొప్ప సినిమాతో ఆకట్టుకున్న తరుణ్ మూర్తి తెలుగులో సినిమా చేస్తే ఆ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. దీంతో చిరంజీవితో ఈయన సినిమా చేయబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ‘తుడారం’ రీమేక్‌ కోసం ఈ భేటీ జరిగిందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా దర్శకుడు దీనిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. “నేను చిరంజీవి గారిని ‘తుడారం’ రీమేక్‌ గురించి కలవలేదు. చిరంజీవి గారు నన్ను వ్యక్తిగతంగా కలవాలని ఆయన టీమ్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే ఫ్లైట్ ఎక్కి ఆయన ఇంటికి వెళ్లి కలిశాను. మేమిద్దరం సినిమాలు, వ్యక్తిగత జీవితంపై చాలా సేపు మాట్లాడుకున్నాం.

నేను తీసిన ప్రతి సినిమాలోని సన్నివేశాలను ఆయన ఎంతో వివరంగా చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ క్షణం నా జీవితంలో మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది” అని తెలిపారు. అలాగే “ఎప్పటికీ సూపర్‌స్టార్‌గా నిలిచిన చిరంజీవి గారు ఇప్పటికీ సినిమాలను చిన్నపిల్లాడి ఉత్సాహంతో ఆస్వాదించడం ఆయన ప్రత్యేకత. జీవితంలో కొన్ని చిన్న క్షణాలే మన కలలను మరింత పెద్దవిగా మారుస్తాయి. కానీ ఇది చిన్న క్షణం కాదు.. నా జీవితంలోనే అతిపెద్ద ఆనంద క్షణం” అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. దీంతో అభిమానుల్లో మరోసారి ఆసక్తి పెరిగింది. చిరంజీవితో ఈ దర్శకుడి కాంబినేషన్‌లో సినిమా ఉండొచ్చని చాలామంది భావిస్తున్నప్పటికీ, దీనిపై మాత్రం ఆయన ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఈ దర్శకుడు చిరంజీవితో కాకుండా మరో తెలుగు యువ హీరోతో సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

Next Story