- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయేది.. వాళ్లు మమ్మల్ని ప్రశాంతంగా బతకనిచ్చేవారు కాదు: రవీనా టాండన్

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ స్టార్ నటి రవీనా టాండన్ అందరికీ సుపరిచితమే. అప్పట్లో ఆమెతో సినిమాలు చేయడానికి అగ్ర దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టేవారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రవీనా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవీనా టాండన్, తన కెరీర్ తొలినాళ్లలో మీడియా వల్ల ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంటూ ఎమోషనల్ అయింది. కొందరు జర్నలిస్టులు రాసిన తప్పుడు వార్తల వల్ల నటీనటుల జీవితాలు ఎలా ప్రభావితమయ్యేవో ఆమె ఓపెన్‌గా వివరించింది. "అప్పట్లో ఎల్లో జర్నలీజానికి అసలు అడ్డుఅదుపు ఉండేది కాదు. ఈ రోజుల్లో అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా మనపై తప్పుడు వార్తలు రాస్తే వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టో లేదా లైవ్‌లోకి వచ్చో నేరుగా ప్రేక్షకులతో మాట్లాడి వాస్తవాలు చెప్పవచ్చు. కానీ, నాడు మాకు అలాంటి అవకాశం ఉండేది కాదు. ప్రేక్షకుల వద్దకు నేరుగా వెళ్లే మార్గం లేకపోవడంతో మీడియాలో వచ్చే పుకార్లను ఖండించడం చాలా కష్టంగా ఉండేది. నాటి పత్రికల ఎడిటర్లకు నచ్చినట్లు నడుచుకునే నటీనటులకే పేపర్లలో మంచి ప్రాధాన్యత దక్కేది. ఎవరైనా తమ వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచుకోవాలని చూస్తే, వారిపై రకరకాల కథనాలు రాస్తూ ప్రశాంతంగా బతకనిచ్చేవారు కాదు" అని ఆరోపించింది.
పత్రికల్లో వచ్చే నెగెటివ్ హెడ్‌లైన్స్ ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయేవి అని రవీనా ఆవేదన వ్యక్తం చేసింది. "మాపై తప్పుడు వార్తలు రాసి, ఆ తర్వాత ఎంత క్షమాపణలు చెప్పినా ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు. తదుపరి సంచలన వార్త వచ్చే వరకు మేము ఆ అపవాదును భరిస్తూ వేచి చూడాల్సి వచ్చేది. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి పత్రికలో ఎక్కడో ఒక చిన్న మూలన క్షమాపణలు ప్రచురించేవారు. కానీ, దానికి ఎలాంటి విలువ ఉండేది కాదు. ఎందుకంటే అప్పటికే జరగాల్సిన నష్టం, మా వ్యక్తిత్వానికి జరగాల్సిన భంగం జరిగిపోయేది. ఆ తప్పుడు వార్తలే ప్రజల మైండ్‌లో అలానే ఉండిపోయేవి, వాటిని మార్చడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు" అంటూ రవీనా ఎమోషనల్ అయింది. ఇక రవీనా టాండన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ లో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో రవీనాతో పాటు దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్షద్ వార్సి, జాకీ ష్రాఫ్, పరేష్ రావల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






