ఆనాటి సవాళ్లు, అవమానాలే నన్ను స్ట్రాంగ్‌గా ఉండేలా చేశాయి.. భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

భారతదేశానికి వచ్చి పాఠశాలలో చేరినప్పుడు.. తన విభిన్నమైన యాస కారణంగా క్లాస్‌మేట్స్ నుండి తీవ్రమైన వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చిందని వెల్లడించారు.

ఆనాటి సవాళ్లు, అవమానాలే నన్ను స్ట్రాంగ్‌గా ఉండేలా చేశాయి.. భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ‘మిచ్చర్ బచ్చన్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అమ్మడుకి ఒక్క హిట్ కూడా పడలేదు. అయినప్పటికీ భాగ్యశ్రీ బోర్సేకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు భారీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ‘సెయాన్’ మూవీతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. అలాగే తెలుగులో అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ చిత్రంలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 10న విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా.. ప్రమోషన్స్‌లో భాగంగా భాగ్యశ్రీ తన బాల్యంలో జరిగిన చేదు అనుభవాలను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. నైజీరియాలోని లాగోస్‌లో గడిపిన తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తన బాల్యమంతా నైజీరియాలోని లాగోస్ నగరంలోనే గడిపానని.. అక్కడి వాతావరణంలో పెరగడం వల్ల ఓ ప్రత్యేకమైన యాస అలవడిందని అన్నారు. అయితే, ఆ తర్వాత భారతదేశానికి వచ్చి పాఠశాలలో చేరినప్పుడు.. తన విభిన్నమైన యాస కారణంగా క్లాస్‌మేట్స్ నుండి తీవ్రమైన వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చిందని వెల్లడించారు. మిగతా పిల్లల కంటే భిన్నంగా మాట్లాడటంతో అందరూ తనను వింతగా చూసేవారని, స్కూల్లో ఎగతాళి చేస్తూ ఏడిపించేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వయసులో అది తనను ఎంతో మానసిక వేదనకు గురిచేసిందని చెప్పారు. బాల్యంలో ఎదురైన ఆ చేదు అనుభవాలు తనను కుంగదీయలేదని, భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిగా మారాయని భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. ఆనాటి సవాళ్లు, అవమానాలే తన ఆత్మవిశ్వాసాన్ని తన జీవిత ప్రయాణాన్ని పూర్తిగా తీర్చిదిద్దాయని చెప్పారు. ఆ రోజుల్లో పడ్డ కష్టం వల్లే తాను వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ మరింత దృఢంగా, ధైర్యంగా తయారయ్యానని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా తట్టుకునే శక్తి ఆ రోజుల్లోనే తనకు లభించిందని చెప్పుకొచ్చారు.

Next Story