మారుతి తదుపరి సినిమాపై క్లారిటీ ఇచ్చిన ఎస్‌కేఎన్

by Pulgam srinivas |

మారుతి తదుపరి సినిమా విషయంపై ఈ నెలాఖరులోగా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎస్‌కేఎన్ తెలిపారు.

మారుతి తదుపరి సినిమాపై క్లారిటీ ఇచ్చిన ఎస్‌కేఎన్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మారుతి ఒకరు. ఆయన ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకేక్కిన 'ది రాజా సాబ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా విడుదలై కొంతకాలం గడిచినా మారుతి తదుపరి ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా, మారుతికి ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్‌తో మంచి స్నేహం ఉంది.

గత కొంతకాలంగా మారుతి, ఎస్‌కేఎన్ బ్యానర్‌లో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఎస్‌కేఎన్ నిర్మించిన 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రం జూలై 24న విడుదల కానున్న నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, "మారుతి తదుపరి సినిమా మీ బ్యానర్‌లోనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది?" అని ప్రశ్నించగా, ఎస్‌కేఎన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "ఈరోజు సాయంత్రం ఇంటర్వ్యూలు పూర్తయ్యాక ఇంటికి రమ్మని మారుతి చెప్పారు.

వెళ్లాక ఏం చెబుతారో చూడాలి. ప్రస్తుతం ఆయన రెండు, మూడు కథలపై పని చేస్తున్నారు. అలాగే ఇద్దరు, ముగ్గురు హీరోలను దృష్టిలో పెట్టుకుని చర్చలు జరుపుతున్నారు. నేను ఆయనతో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాను. అయితే ప్రస్తుతం నేను కూడా రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉన్నాను. అందువల్ల ఇప్పట్లో మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశాలు తక్కువ. అయితే ఈ నెలాఖరులోగా మారుతి తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది" అని ఎస్‌కేఎన్ తెలిపారు.

Next Story