45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న “ శంకరాభరణం “ సినిమా.. ఈ మూవీ ప్రత్యేకతలు ఇవే..

by Gugulothu.Kavitha |

తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ”శంకరాభరణం”(Sankarabharanam) చిత్రం విడుదలయ్యి నేటికి 45 సంవత్సరాలు పూర్తయింది.

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న “ శంకరాభరణం “ సినిమా.. ఈ మూవీ ప్రత్యేకతలు ఇవే..
X

దిశ, సినిమా: తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ”శంకరాభరణం”(Sankarabharanam) చిత్రం విడుదలయ్యి నేటికి 45 సంవత్సరాలు పూర్తయింది. ఫిబ్రవరి 2 , 1980 వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌(Andhra Pradesh)లో విడుదలయిన ఈ మూవీకి.. కళా తపస్వి శ్రీ కె.విశ్వనాథ్(K. Vishwanath) దర్శకత్వం వహించగా.. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై శ్రీ ఏడిద నాగేశ్వరరావు(Yeditha Nageswara Rao), ఆకాశం శ్రీరాములు(Akasam Sriramulu) నిర్మించారు . ఇక ఇందులో జె.వి. సోమయాజులు(V. Somayajulu), మంజుభార్గవి(Manchu Bhargavi), శ్రీ అల్లు రామలింగయ్య(Allu Ramalingaiah) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేశారు. కాగా ఈ సినిమాకి శ్రీ కె.వి.మహదేవన్(K.v Mahadevan) సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.

అయితే ఈ చిత్రం కేవలం ఉమ్మడి ఏపీలో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, పక్క రాష్ట్రాలైన తమిళనాడు(Tamilnadu), కర్ణాటక(Karnataka), కేరళ(Kerala)లలో కూడా అఖండ విజయం సాధించి, అప్పట్లోనే పాన్ ఇండియా మూవీగా నిలిచింది. అంతేకాకుండా అమెరికా(America)లో కూడా రెగ్యులర్ థియేటర్స్‌లో విడుదలైన మొట్ట మొదటి చిత్రం శంకరాభరణం కావడం విశేషం. అలాగే ప్రపంచ నలు మూలల్లో ఎన్నో దేశాల్లో విడుదలయ్యి, తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది ఈ చిత్రం. ఆ రోజుల్లో ఎవరి నోట విన్నా శంకరాభరణం గురించే ప్రస్తావన.

శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో, ఈ సినిమా విడుదల తర్వాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రతి తెలుగు వాడు మా సినిమా అని గర్వంగా చెప్పుకొనేవారు. ఇక అవార్డుల విషయానికి వస్తే.. జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు, వినోదాత్మకంతో కూడిన జనరంజక చిత్రంగా ‘స్వర్ణ కమలం’ అందుకుంది. తెలుగులో స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. అలాగే గాయకులు శ్రీ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం‌(SP. Balasubramanyam)కు ఉత్తమ నేపథ్య గాయకునిగా తొలి సారి జాతీయ అవార్డు , శ్రీమతి వాణి జయరాం(Vani Jayaram)కు ఉత్తమ గాయకురాలుగా, శ్రీ కె.వి.మహదేవన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు .

అలాగే Besancon ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ( ఫ్రాన్స్ )లో ఉత్తమ చిత్రంగా అంతర్జాతీయ అవార్డు అందుకున్నది. అంతేకాకుండా మన ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డులు 8 గెలుచుకుంది . ఇక శ్రీ చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara Rao) గారు శంకరాభరణం మూవీపై మూడు రోజులు ప్రవచనాల కార్యక్రమం చేశారు. అలా ఓ చిత్రంపై ప్రవచనం నిర్వహించటం అదే ఫస్ట్ టైం. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చింది ఈ సినిమా. కాగా జె.వి. సోమయాజులు గారిని ఈ మూవీ తర్వాత అందరూ శంకరాభరణం శంకరశాస్త్రి అనే పిలిచేవారు .

ప్రస్తుతం ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికీ భాషతో సంబంధం లేకుండా అందరూ పాడుతూనే ఉంటారు. ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తాను చెన్నై & హైదరాబాద్‌లో నిర్మించిన ఇళ్లకు శంకరాభరణం అనే పేరు పెట్టుకున్నారు . నాలుగున్నర దశాబ్దాలు గడిచినా , ఇంకా ఈ చిత్రం ఏదో మాధ్యమంలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.

Next Story