సెన్సార్ బోర్డు ఒక జోక్ : ఆర్జీవీ సంచలన ట్వీట్

by Muthe.Rajitha |

సెన్సార్ బోర్డు ఇప్పటి కాలానికి పూర్తిగా పాతబడిపోయిందని, అసలు సెన్సార్ బోర్డు అనేది ఒక జోక్ అని తీవ్రంగా విమర్శించారు.

సెన్సార్ బోర్డు ఒక జోక్ : ఆర్జీవీ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్ : వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (RGV) చేసిన ట్వీట్‌ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఆ ట్వీట్ లో సెన్సార్ బోర్డు ఇప్పటి కాలానికి పూర్తిగా పాతబడిపోయిందని, అసలు సెన్సార్ బోర్డు అనేది ఒక జోక్ అని తీవ్రంగా విమర్శించారు. తాను మాట్లాడుతున్నది కేవలం నటుడు విజయ్ సినిమా ‘జననాయకన్’ సెన్సార్ సమస్యకే పరిమితం కాదని, మొత్తం వ్యవస్థ గురించే మాట్లాడుతున్నానని అన్నారు. ఒకప్పుడు సినిమా చూసేందుకు సినిమా థియేటర్లే మార్గం, మీడియాపై ప్రభుత్వ నియంత్రణ ఉండేది కాబట్టి అప్పట్లో సెన్సార్ అవసరం ఉండొచ్చని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అభిప్రాయ పడ్డారు.

ఈ రోజుల్లో ఒక చిన్న పిల్లవాడికే మొబైల్ ఫోన్ ద్వారా మర్డర్ వీడియోలు, పోర్న్ కంటెంట్, తీవ్రవాద ప్రచారం అన్నీ ఎలాంటి నియంత్రణ లేకుండా క్షణాల్లో అందుబాటులో ఉంటున్నాయని, సోషల్ మీడియా సినిమాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతోందని చెప్పారు. టీవీ డిబేట్లు, యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా వేదికల్లో అసభ్య భాష, ద్వేష ప్రసంగాలు నిరంతరం సాగుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో సినిమాల్లో ఒక మాట కట్ చేయడం లేదా సిగరెట్ బ్లర్ చేయడం ద్వారా సమాజాన్ని రక్షిస్తున్నామని అనుకోవడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు.

సెన్సార్ బోర్డు ఒకప్పుడు టెక్నాలజీ లేని కాలంలో, సమాచార వ్యవస్థకు గేట్కీపర్లు ఉన్న సమయంలో పుట్టిందని, కానీ ఇప్పుడు ఎవరు ఏం చూడాలో నిర్ణయించే శక్తి ఎవరికీ లేదని RGV అంటున్నారు. ఈ రోజుల్లో సెన్సార్ ప్రజలను కాపాడడం కాదు, ప్రేక్షకులను అవమానించడం మాత్రమేనని పేర్కొన్నారు. దేశాన్ని ఎవరు పాలించాలో నిర్ణయించే తెలివి మనకు ఉందంటే, మనం ఏం చూడాలో, ఏం వినాలో నిర్ణయించే హక్కు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సెన్సార్ ఇప్పుడు నిజమైన బాధ్యత కాదు, కేవలం అధికారాన్ని చూపించే నాటకమేనని, కత్తెరతో ఆలోచనలను కట్ చేయడమే జరుగుతోందని విమర్శించారు.

సోషల్ మీడియాలో స్వేచ్ఛగా హింస చూస్తూ, థియేటర్‌లో మాత్రం సినిమా మీద నైతికత పేరుతో అభ్యంతరం చెప్పడం పెద్ద ద్వంద్వ వైఖరని అన్నారు. సినిమా క్లాస్‌రూమ్ కాదని, అది భావాలను, అభిప్రాయాలను ప్రతిబింబించే ఒక అద్దమని, ప్రజలు తమకు నచ్చినది తామే నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇవ్వాల్సిందేనని, అదే రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛ అని RGV స్పష్టం చేశారు. పిల్లల రక్షణ పేరుతో సెన్సార్‌ను సమర్థించడం అర్థరహితమని, వయోపరిమితి, కంటెంట్ వార్నింగ్స్ సరైనవే కానీ సెన్సార్ మాత్రం అవసరం లేదని తేల్చిచెప్పారు. గోడలు కూలిపోయిన భవనానికి ఇంకా వాచ్‌మన్ పెట్టినట్టే సెన్సార్ బోర్డు కొనసాగుతుందన్న RGV వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీశాయి.

Next Story