రెహమాన్ కష్టం.. 'పెద్ది'కి భారీ బలం కాబోతుందా?

by Pulgam srinivas |

ఈ సినిమా కోసం రెహమాన్ ప్రత్యేకంగా 'పెద్ది ఆంథమ్' సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అది అద్భుతమైన రీతిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రెహమాన్ కష్టం.. పెద్దికి భారీ బలం కాబోతుందా?
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన సంగీతంతో కోట్లాది మంది శ్రోతలను ఆకట్టుకున్న ఆయన, ఎన్నో సినిమాల విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. రెహమాన్ భారతదేశవ్యాప్తంగా ఎక్కువగా హిందీ, తమిళ చిత్రాలకు సంగీతం అందించగా, తెలుగులో మాత్రం చాలా తక్కువ సినిమాలకే మ్యూజిక్ అందించారు. చాలామంది తెలుగు దర్శకులు కూడా రెహమాన్‌ను అంత సులభంగా సినిమాకు ఒప్పించలేరని, ఆయన ముందుగా కథ విని నచ్చితేనే సినిమా చేయడానికి ఒప్పుకుంటారని పలుమార్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి.

ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆయన ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఇప్పటివరకు విడుదలైన ఈ చిత్రంలోని రెండు పాటలు మంచి స్పందనను అందుకున్నాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదే స్థాయిలో ఉండబోతుందనే సమాచారం రావడంతో ఈ మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం రెహమాన్ ప్రత్యేకంగా 'పెద్ది ఆంథమ్' సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ సమయానికి ఆ ఆంథమ్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. అది అద్భుతమైన రీతిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలకు ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (ఆర్ఆర్) చేసి దర్శకుడు బుచ్చిబాబుకు వినిపించినట్లు, అవి నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇప్పటివరకు ఈ సినిమా మ్యూజిక్‌పై వస్తున్న అద్భుతమైన పాజిటివ్ ఫీడ్బ్యాక్ దృష్ట్యా, ఈ చిత్రం కోసం రెహమాన్ పడుతున్న కష్టం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story