పల్నాటి బ్రహ్మనాయుడు చెత్త కథ.. ఆ ఫ్లాప్‌కు కారణం నేనే.. షాకింగ్ నిజాలు చెప్పిన పోసాని

by Pulgam srinivas |

'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా ఫ్లాప్‌కు పూర్తి బాధ్యత తనదేనని, అది బలహీనమైన కథని పోసాని చెప్పుకొచ్చారు.

పల్నాటి బ్రహ్మనాయుడు చెత్త కథ.. ఆ ఫ్లాప్‌కు కారణం నేనే.. షాకింగ్ నిజాలు చెప్పిన పోసాని
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ రైటర్ పోసాని కృష్ణమురళి తన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలను అందించారు. ఆయన కథ అందించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఆయన కథతో తెరకెక్కిన 'పల్నాటి బ్రహ్మనాయుడు' మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూడటమే కాకుండా, అందులోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసానికి, "మీరు కథ అందించిన 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా ఫ్లాప్ కావడంతో పాటు, అందులోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. మీలాంటి రచయిత అలాంటి సన్నివేశాలు ఎందుకు రాశారు?" అనే ప్రశ్న ఎదురైంది. దీనికి పోసాని స్పందిస్తూ.. ఆ సినిమాకు కథను నేను అందించాను.

మొదట బి. గోపాల్ గారు, బాలకృష్ణ గారు కథ విని నచ్చడంతోనే సినిమాను ప్రారంభించారు. గోపాల్ గారికి కథ నచ్చకపోతే సున్నితంగా చెప్పేస్తారు. అసలు నచ్చని కథతో ఆయన సినిమా చేయరు. కథ నచ్చిన తర్వాతే ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అయితే ఆ తర్వాతి పనులను పరుచూరి బ్రదర్స్ నిర్వహించారు. ఒక సినిమా హిట్ అయితే కథ నేను ఇచ్చానని చెప్పుకుని, ఫ్లాప్ అయితే కథలో చాలా మార్పులు చేశారని చెప్పడం నాకు నచ్చదు. 'పల్నాటి బ్రహ్మనాయుడు' ఒక చెత్త కథ. ఆ సినిమా ఫ్లాప్ కావడానికి పూర్తి బాధ్యత నాదే అని నేను ఒప్పుకుంటున్నానని పోసాని స్పష్టం చేశారు.ఇక బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'పల్నాటి బ్రహ్మనాయుడు' చిత్రానికి బి. గోపాల్ దర్శకత్వం వహించగా, ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story