బెంగ‌ళూరులో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ‌.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం!

by Ramesh Naini |

ప్రముఖ నటుడు, జూనియర్ ఎన్టీఆర్‌కు కర్ణాటకలో ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది.

బెంగ‌ళూరులో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ‌.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ నటుడు, జూనియర్ ఎన్టీఆర్‌కు కర్ణాటకలో ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. బెంగళూరులోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి (కిమ్స్) ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తారక్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అయితే, ఎన్టీఆర్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోపులాట జరిగి ఎస్కలేటర్ అద్దాలు పగిలిపోవడంతో తృటిలో ఓ భారీ ప్రమాదం తప్పింది.

'సీఎం.. సీఎం' అంటూ దద్దరిల్లిన బెంగళూరు

చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ పబ్లిక్ వేదికపైకి రావడంతో ఆయనను కళ్లారా చూసేందుకు కర్ణాటక నలుమూలల నుంచి అభిమానులు తరలి వచ్చారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఆసుపత్రి వరకు దారిపొడవునా ఎక్కడ చూసినా తారక్ ఫ్యాన్సే కనిపించారు. తారక్ కారు దిగగానే ఒక్కసారిగా 'సీఎం.. సీఎం..' అంటూ నినాదాలతో హోరెత్తించారు. భారీ ఎత్తున ఫ్లెక్సీలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ అభిమానుల తాకిడితో బెంగళూరు రోడ్లు కిక్కిరిసిపోయాయి. మహాదేవపుర, ఎలక్ట్రానిక్ సిటీ వైపు వెళ్లే ప్రధాన రహదారులన్నీ పూర్తిగా స్తంభించిపోయాయి. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసుల అంచనాలకు మించి జనం రావడంతో సిగ్నల్స్ వద్ద పరిస్థితి అదుపు తప్పింది. దీంతో వెంటనే అప్రమత్తమైన బెంగళూరు పోలీసులు అదనపు బలగాలతో రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

పగిలిన ఎస్కలేటర్ అద్దాలు..

ఆసుపత్రి ప్రారంభోత్సవం కోసం లోపలికి వెళ్లిన ఎన్టీఆర్‌ను అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. తారక్ వద్దకు వెళ్లేందుకు జనం ఎగబడటంతో తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. ఈ క్రమంలో కిమ్స్ ఆసుపత్రిలోని ఎస్కలేటర్ అద్దాలు పగిలిపోయాయి. తొక్కిసలాట వాతావరణం నెలకొనడంతో పలువురు అభిమానులు కిందపడిపోయారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

Next Story