ఎస్.జె సూర్య ‘కిల్లర్’ షూటింగ్‌ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆందోళన చెందుతున్న అభిమానులు

by Mallepaka Hamsa |

ఎస్ జె సూర్య నటిస్తున్న ‘కిల్లర్’ సినిమా షూటింగ్ సెట్‌లో ఓ భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఎస్.జె సూర్య ‘కిల్లర్’  షూటింగ్‌ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆందోళన చెందుతున్న అభిమానులు
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ నటుడు, దర్శకుడు, నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎస్ జె సూర్య నటిస్తున్న ‘కిల్లర్’ సినిమా షూటింగ్ సెట్‌లో ఓ భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సీన్ల చిత్రీకరణ చెన్నైలోని ఒట్టేరి ప్రాంతంలో ఉన్న ప్రముఖ బిన్నీ మిల్స్ ప్రాంగణంలో జరుగుతోంది. ఈ షూటింగ్ సమయంలో అనుకోకుండా ఒక గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో మదన్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం అందరినీ తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాద తీవ్రతకు మరో ముగ్గురు వ్యక్తులకు శరీర భాగాలపై తీవ్రమైన కాలిన గాయాలైనట్లు సమాచారం.

వారితో పాటు సెట్స్‌లో ఉన్న మరో 10 మందికి పైగా సిబ్బందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టగా.. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, అసలు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, ఎస్ జె సూర్య అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్ర యూనిట్ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు.

Next Story