డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా

by Malleboina Mahesh |   (  Updated:2025-11-19 13:17:03  IST  )

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీ, అధిక యూజర్ ఛార్జీలు, థియేటర్స్‌లో తినుబండారాల రేట్లు, సినిమా పైరసీ తదితర సమస్యలకు వ్యతిరేకంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయం వద్ద మహా ధర్నా జరిగింది.

డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీ, అధిక యూజర్ ఛార్జీలు, థియేటర్స్‌లో తినుబండారాల రేట్లు, సినిమా పైరసీ తదితర సమస్యలకు వ్యతిరేకంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయం వద్ద మహా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా డా. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, కొన్ని ప్రొడ్యూసర్లు క్యూబ్, యుఎఫ్ఓ, పీఎక్స్‌డీ వంటి డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లతో కలిసి పనిచేస్తూ వారానికి రూ.10 వేల నుంచి 15 వేల వరకు నిర్మాతలపై భారాన్ని మోపుతున్నారని, పక్క రాష్ట్రాల్లో ఇలాంటి ఛార్జీలు కేవలం 2,500–3,000 రూపాయలే ఉంటాయన్నారు. అధిక డిజిటల్ ఛార్జీలు, భారీ టికెట్ ధరలు, థియేటర్లలో అధిక ఫుడ్ రేట్ల వల్ల చిన్న సినిమాకు థియేటర్లలో బతికే అవకాశం లేకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

నిర్మాత లయన్ సాయి వెంకట్, నిర్మాత డీఎస్ రెడ్డి మాట్లాడుతూ, 400 థియేటర్లలో సినిమా రిలీజ్ చేయాలంటే కేవలం డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లకే రూ.50 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుందని, ఇది చిన్న నిర్మాతలకు అసాధ్యమని చెప్పారు. నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ, కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు నిర్మించినా రూపాయి కూడా తిరిగి రాకుండా చిన్న నిర్మాతలు తీవ్రమైన నష్టాల్లో ఉన్నారని, ఈ పరిస్థితిలో ఇండస్ట్రీలో కొద్దిమంది నిర్మాతలే మిగిలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నటుడు–దర్శకుడు సిరాజ్ మాట్లాడుతూ చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని, ఓటీటీలు, శాటిలైట్ ఛానళ్లూ చిన్న సినిమాలను తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లు ఛార్జీలు తగ్గించకపోతే ధర్నాలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు. చిన్న సినిమాలు బతికేలా ప్రభుత్వం జోక్యం చేసుకుని స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఈ నిరసనలో నిర్మాత రవి, నటుడు సన్నీ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story