ఇళయరాజాను క్షమాపణలు కోరుతూ ‘కరుప్పు’ టీమ్ కీలక నోట్ విడుదల

by Mallepaka Hamsa |

ఆయన మనోభావాలను దెబ్బతీయడం లేదా అగౌరవపరచడం తమ ఉద్దేశం ఎంతమాత్రం కాదని.. వివాదానికి కారణమైన ఆ సీన్లను సినిమాలోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

ఇళయరాజాను క్షమాపణలు కోరుతూ ‘కరుప్పు’ టీమ్ కీలక నోట్ విడుదల
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, త్రిష జంటగా నటించిన చిత్రం ‘కరుప్పు’. టాలెంటెడ్ ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలై థియేటర్లలో మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ సూర్య ఖాతాలో మంచి కంబ్యాక్ హిట్‌గా నిలిచింది. అయితే, ఒకవైపు సినిమా సక్సెస్‌తో దూసుకుపోతున్నప్పటికీ.. మరోవైపు ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు ఇప్పుడు వివాదానికి దారితీశాయి. ఈ సినిమాలో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను ఉద్దేశిస్తూ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగులు ఇళయరాజా గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తాజాగా, ఈ విషయంపై ‘కరుప్పు’ మూవీ టీమ్.. ఇళయరాజాకు క్షమాపణలు చెబుతూ ఓ నోట్ విడుదల చేసింది.

సంగీత దర్శకులు ఇళయరాజా గారిపై తమకు ఎంతో గౌరవం ఉందని.. భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన సేవలు ఎందరో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఎన్నో తరాలుగా స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయని అన్నారు. అయితే కరుప్పు సినిమాలో ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న ఒక డైలాగ్ వల్ల ఆయన బాధపడ్డారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకే తాము ఇళయరాజాను క్షమాపణలు కోరుతున్నామని పేర్కొన్నారు. ఆయన మనోభావాలను దెబ్బతీయడం లేదా అగౌరవపరచడం తమ ఉద్దేశం ఎంతమాత్రం కాదని.. వివాదానికి కారణమైన ఆ సీన్లను సినిమాలోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ రోజు నుంచే థియేటర్లలో ఈ మార్పులు అమలులోకి వస్తాయని చెప్పారు. అందరి గౌరవమే ప్రధానం అని .. కాబట్టి, దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని కోరారు. దీనిని మరింత కాంట్రవర్సీగా మార్చి ఎలాంటి తప్పుడు వార్తలను సృష్టించవద్దని వేడుకున్నారు.

Next Story