అలా చేయకపోతే నాకు అవకాశాలు దక్కవేమోనని భయపడ్డాను.. అమితాబ్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

తన కెరీర్ ప్రారంభంలో, స్టార్‌డమ్‌లో ఉన్న రోజుల్లో ఒకే సమయంలో 10 నుండి 15 సినిమాల్లో ఎలా నటించాల్సి వచ్చిందో, దాని వెనుక ఉన్న అసలు భయం ఏమిటో ఆయన వివరించారు.

అలా చేయకపోతే నాకు అవకాశాలు దక్కవేమోనని భయపడ్డాను.. అమితాబ్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: భారతీయ సినిమా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వరుస సినిమాలు చేస్తూ ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. ఇటీవల ‘కల్కి’ చిత్రంలో కీలక పాత్రలో నటించి ప్రశంసలు పొందారు. ఇక ఇప్పడు ‘కల్కి’ సీక్వెల్‌లో నటించనున్నారు. అంతేకాకుండా దాదాపు 25 ఏళ్లుగా కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా ఆయన పాత రోజులను గుర్తుచేసుకుంటూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో, స్టార్‌డమ్‌లో ఉన్న రోజుల్లో ఒకే సమయంలో 10 నుండి 15 సినిమాల్లో ఎలా నటించాల్సి వచ్చిందో, దాని వెనుక ఉన్న అసలు భయం ఏమిటో ఆయన వివరించారు. నేటి తరం నటీనటుల అంకితభావాన్ని అమితాబ్ ఎంతో ప్రశంసించారు. ఇప్పటి తరం నటులు ఒక సినిమా చేసేటప్పుడు ఆ పాత్ర కోసం చేసే ప్రిపరేషన్ గురించి ఆయన మాట్లాడారు. తమ కాలంలో అసలు ప్రిపరేషన్ అనే పదమే తెలియదని అన్నారు.

ఇప్పుడున్న నటులు ఒక క్యారెక్టర్ లోకి మారడానికి, లుక్, స్టైల్, క్యారెక్టర్ అనాలిసిస్ కోసం ఎంతో కష్టపడుతున్నారని, వారి శ్రమను చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందని బిగ్ బి ప్రశంసించారు. అయితే పాత రోజుల్లో తాము ఒకే రోజు రెండు, మూడు సినిమాల షూటింగుల్లో పాల్గొనేవాళ్లమని అమితాబ్ గుర్తుచేసుకున్నారు. అలాంటప్పుడు ఒక పాత్ర కోసం ప్రిపేర్ అయ్యి, వెంటనే మరో పాత్ర కోసం అన్‌-ప్రిపేర్ అవ్వడం అస్సలు సాధ్యమయ్యేది కాదని చెప్పారు. ఆ రోజుల్లో నటులు పూర్తిగా దర్శకులపైనే ఆధారపడేవారని, సెట్‌కు వెళ్ళగానే అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి సీన్ ఏంటో చెబితే.. వెంటనే కెమెరా ముందుకు వెళ్లి నటించేవాళ్లమని అన్నారు. అన్ని పాత్రల్లోకి అంత వేగంగా ఎలా మారగలిగేవారు? అని చాలామంది అడుగుతుంటారని చెబుతూ.. దాని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని అమితాబ్ బయటపెట్టారు. ‘‘అలా చేయకపోతే రేపు పొద్దున ఇండస్ట్రీలో అసలు అవకాశాలు వస్తాయో రావో, నిరుద్యోగిగా మిగిలిపోతామేమో అనే భయం మాలో ఉండేది. అందుకే దర్శకులు ఏం చెబితే అది ఎంతో నమ్మకంగా, నిజాయితీగా చేయడానికి ప్రయత్నించేవాళ్లం" అని చెప్పుకొచ్చారు.

Next Story