Hari Teja: ఆ పాత్రకు నేను బ్రాండ్ అంబాసిడర్‌లా మారాను

by Pulgam srinivas |

తాజాగా హరితేజ నేను పనిమనిషి పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్‌లా మారినట్లు ఉన్నాను అని చెప్పుకొచ్చింది.

Hari Teja: ఆ పాత్రకు నేను బ్రాండ్ అంబాసిడర్‌లా మారాను
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నో సీరియల్స్ లో నటించి, ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసి బుల్లితెర అభిమానుల మనసు దోచుకున్న హరితేజ ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించినా నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అఆ' చిత్రం ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు త్రివిక్రమ్ కూడా ఈ చిత్రంలోని హరితేజ పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతాయని చెప్పారు. చెప్పిన విధంగానే ఈ నటికి మంచి గుర్తింపు ఈ చిత్రం ద్వారా వచ్చింది.

ఇందులో ఈమె సమంతకి పనిమనిషి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత ఈమె చాలా సినిమాల్లో నటించింది. అందులో అనేక చిత్రాల్లో ఈమె పనిమనిషి పాత్రలోనే కనిపించింది. తాజాగా హరితేజ 'లేచింది మహిళా లోకం' అనే చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీలో మంచు లక్ష్మి, అనన్య నాగళ్ళ, హేమ, సుప్రీత, శ్రద్ధాదాస్ కూడా నటించారు. ఈ సినిమాను ఈ నెల 26న విడుదల చేయనున్నారు. దానితో ఈ మూవీ బృందం ఒక ఈవెంట్ను ఏర్పాటు చేసింది.

అందులో ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన చాలామంది పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో హరితేజకు మీరు ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించారు, అందులో ఎక్కువ శాతం పనిమనిషి పాత్రల్లో కనిపించారు, అందుకు ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి హరితేజ... నాకు ఎక్కువ శాతం పనిమనిషి పాత్రలే వస్తున్నాయి. ఆ పాత్రకు నేను బ్రాండ్ అంబాసిడర్లా మారినట్లు ఉన్నాను అని నవ్వుతూ సమాధానం చెప్పింది. హరితేజ చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Next Story