రిస్క్ తీసుకోవడానికి నేనెప్పుడూ భయపడను.. దర్శకుడిగా మారడంపై రామ్ పోతినేని ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, అయినప్పటికీ తాను ఎప్పుడూ తన సొంత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇస్తూ బతుకుతున్నట్లు రామ్ చెప్పారు.

రిస్క్ తీసుకోవడానికి నేనెప్పుడూ భయపడను.. దర్శకుడిగా మారడంపై రామ్ పోతినేని ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గత ఏడాది ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. గత కొద్ది కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్ ఆశలన్నీ ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ సినిమాపై పెట్టుకున్నప్పటికీ నిరాశనే ఎదురైంది. దీంతో రామ్ పోతినేని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తన కెరీర్‌లో 23వ ప్రాజెక్ట్ ‘RAPO-23’ కోసం ఆయన ఏకంగా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనతోనే మేకర్స్ అంచనాలు పెంచారు. ఇక వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ దర్శకుడిగా మారడంపై నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో రిస్క్ అవసరమా అని సలహాలు ఇస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా రామ్ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్‌లో రిస్క్ తీసుకోవడానికి తాను ఎప్పుడూ భయపడలేదని, అదే మైండ్‌సెట్‌తోనే ఇప్పుడు దర్శకుడి సీట్లో కూర్చోబోతున్నానని స్పష్టం చేశారు.

సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, అయినప్పటికీ తాను ఎప్పుడూ తన సొంత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇస్తూ బతుకుతున్నట్లు రామ్ చెప్పారు. సినిమా రంగంలో దాదాపు 20 ఏళ్ల ప్రయాణం తర్వాత, దర్శకత్వం వైపు అడుగులు వేయడం అనేది తన కెరీర్‌లో చాలా సహజంగా జరిగిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. తన సినీ జర్నీని గుర్తు చేసుకుంటూ.. కేవలం 18 ఏళ్ల చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని, ఈ ప్రయాణంలో చూసిన ఎన్నో ఎత్తుపల్లాలు ఒక నటుడిగా, ఒక వ్యక్తిగా తనను ఎంతగానో మార్చాయని రామ్ చెప్పారు. ఆ అనుభవాలే తనను ఎప్పుడూ ఒదిగి ఉండేలా చేశాయని, కొత్త సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చాయని తెలిపారు. ఇక తన 23వ సినిమాతో రామ్ దర్శకుడిగా పరిచయం అవుతుండటమే కాకుండా.. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ హీరోగానూ నటిస్తున్నారు. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కబోతోంది. కెమెరా ముందు యాక్ట్ చేస్తూనే, కెమెరా వెనుక దర్శకుడిగా బాధ్యతలు అందుకోవడం అనేది తన కెరీర్‌లోనే అతిపెద్ద క్రియేటివ్ ఛాలెంజ్ అని రామ్ పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.

Next Story