స్టార్ హీరోయిన్ తమన్నాకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత

by Ramesh Naini |

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాకు మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురు అయింది.

స్టార్ హీరోయిన్ తమన్నాకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాకు మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురు అయింది. ప్రముఖ సబ్బుల తయారీ సంస్థ ‘పవర్ సోప్స్’ (Power Soaps Limited) పై ఆమె దాఖలు చేసిన అప్పీల్‌ను, రూ.కోటి నష్టపరిహారం డిమాండ్‌ను న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. అసలేం జరిగిందంటే.. పవర్ సోప్స్ సంస్థ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు తమన్నా అక్టోబర్ 7, 2008న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ అగ్రిమెంట్ గడువు అక్టోబర్ 6, 2009తో ముగిసింది. అయితే, ఒప్పంద గడువు తీరిపోయిన తర్వాత కూడా (ముఖ్యంగా నవంబర్ 2010, ఫిబ్రవరి 2011లో తయారైన సబ్బుల కవర్లపై) ఆ సంస్థ తన ఫోటోలను అనధికారికంగా వాడుకుందని తమన్నా ఆరోపించారు. ఈ విషయంపై 2011 జనవరి, ఫిబ్రవరి నెలల్లో సదరు సంస్థకు, వారి కమ్యూనికేషన్ ఏజెన్సీకి నోటీసులు పంపినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో తన ఫోటోలను అనుమతి లేకుండా వాడుకున్నందుకు గాను రూ. 1 కోటి నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు.

సాక్ష్యాల్లేక కొట్టివేత..

ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి బెంచ్.. సంస్థపై చేసిన ఆరోపణలకు సంబంధించి తమన్నా తగిన సాక్ష్యాలు చూపించలేకపోయారని పేర్కొంటూ గతంలోనే పిటిషన్‌ను కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆ తీర్పును సవాల్ చేస్తూ తమన్నా డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. తాజాగా ఈ అప్పీల్‌ను విచారించిన జస్టిస్ పి. వేల్ మురుగన్, జస్టిస్ కె. గోవిందరాజన్ తిలకవాడిలతో కూడిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ తమన్నా వేసిన అప్పీల్‌ను శాశ్వతంగా కొట్టివేసింది.

Next Story