ముగిసిన జీఎస్టీ అధికారుల తనిఖీలు.. మంచు విష్ణు స్పందన ఇదే

by Naga Rani Yarlagadda |

నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగం నిర్వహించిన తనిఖీలు ముగిశాయి. మాదాపూర్‌, కావూరి హిల్స్ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలపై రెండు విభిన్న బృందాలు ఈ తనిఖీలను చేపట్టాయి.

ముగిసిన జీఎస్టీ అధికారుల తనిఖీలు.. మంచు విష్ణు స్పందన ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగం నిర్వహించిన తనిఖీలు ముగిశాయి. మాదాపూర్‌, కావూరి హిల్స్ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలపై రెండు విభిన్న బృందాలు ఈ తనిఖీలను చేపట్టాయి. ఈ సందర్భంగా 'కన్నప్ప' సినిమాకు సంబంధించి పలు డాక్యుమెంట్లు, లావాదేవీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో ప్రాథమికంగా ఆధారాలు లభించినట్లు సమాచారం.

తనిఖీలు జరుగుతున్న సమయంలో విష్ణు కార్యాలయానికి నటుడు మోహన్‌బాబు, రచయిత కోన వెంకట్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. మీడియా ప్రతినిధులు జీఎస్టీ దాడులపై ప్రశ్నించగా, విష్ణు స్పందిస్తూ .. “మీరు చెబితే నాకు విషయం తెలిసింది. దాచే అవసరం ఏమీ లేదు. ఎక్కడెక్కడ అప్పులు చేశామో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది” అని స్పష్టం చేశారు.

ఇక ‘కన్నప్ప’ (Kannappa) సినిమా విషయానికొస్తే, హిందీ వర్షన్‌ ఫైనల్ కాపీని చూశానని, చివరి సన్నివేశాల్లో భావోద్వేగానికి లోనయ్యానని విష్ణు తెలిపారు. ‘‘ఈ తరం వారికి కన్నప్ప కథ తెలియాలనే ఉద్దేశంతో సినిమా రూపొందించాం. ఇది దేవుడు, భక్తుడి మధ్య జరిగిన కథ’’ అని వివరించారు.

ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్-ఇండియా చిత్రంలో విష్ణు హీరోగా కన్నప్ప పాత్ర పోషించారు. అలాగే ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, మోహన్‌బాబు, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ నటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ‘కన్నప్ప’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఏపీలో కన్నప్ప సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 10 రోజుల వరకూ టికెట్ ధరలు పెంచుకోవచ్చని తెలిపింది. అయితే హయయర్ క్లాస్ టికెట్ రేట్లను మాత్రమే పెంచుకోవాలని సూచించింది. సింగిల్‌ స్క్రీన్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 50 వరకూ టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది.

Next Story