‘అగ్లీ స్టోరీ’ కోసం 'వి.వి. వినాయక్'ను రంగంలోకి దింపిన మేకర్స్

by Pulgam srinivas |

‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్‌ను వీక్షించిన వి.వి. వినాయక్ మూవీ యూనిట్‌కు మద్దతుగా నిలిచారు.

‘అగ్లీ స్టోరీ’ కోసం వి.వి. వినాయక్ను రంగంలోకి దింపిన మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్: నందు హీరోగా, అవికా గోర్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను రియా జియో ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రం మే 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు వి.వి. వినాయక్ ఈ సినిమా ట్రైలర్‌ను వీక్షించి మూవీ యూనిట్‌కు తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా దర్శకుడు ప్రణవ స్వరూప్ నాకు చాలా దగ్గర వ్యక్తి. కాకినాడలో ఆయనకు స్వంతంగా ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్ మా అత్తగారి ఇంటి ఎదురుగా ఉండేది.

అంతేకాకుండా మా నాన్నగారితో కూడా ఆయనకు మంచి అనుబంధం ఉంది. మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. అలాగే హీరో నందు గురించి మాట్లాడుతూ.. “నందు భార్య గీతా మాధురి మా ఇంటి ఆడపడుచులాంటి వ్యక్తి. మా సొంత ఊరిలో ఏర్పాటు చేసే గణేష్ మండపానికి మేము పిలిస్తే వచ్చి పాటలు పాడి అక్కడి భక్తులను ఎంతగానో అలరించింది. నందు కూడా మా ఇంటి వ్యక్తిలాంటివాడే. ఇలా నాకు ఎంతో ఆత్మీయమైన వ్యక్తులు కలిసి చేసిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని వినాయక్ తెలిపారు.

Next Story