పిఠాపురంలో అలా మొదలైంది అంటున్న మహేష్..

by Chukka Sudharani |

‘ప్రేయసి రావే’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్‌ చంద్ర.

పిఠాపురంలో అలా మొదలైంది అంటున్న మహేష్..
X

దిశ, సినిమా: ‘ప్రేయసి రావే’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్‌ చంద్ర. తర్వాత ‘అయోధ్య రామయ్య, చెప్పాలని ఉంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం, రెడ్‌ అలర్ట్‌’ వంటి ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఈయన.. చాలా గ్యాప్ తర్వాత ‘పిఠాపురంలో’ మూవీతో రాబోతున్నాడు. ‘అలా మొదలైంది’ అనే ట్యాగ్ లైన్‌లో రాబోతున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్‌, పృధ్వీరాజ్‌, కేదార్‌ శంకర్‌, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్‌ చంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్‌ పటేల్‌, ఎఫ్ఎం మురళి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకోగా.. తాజాగా పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా మీడియాతో ముచ్చటించాడు డైరెక్టర్ మహేష్‌చంద్ర.

‘కుటుంబ భావోద్వేగాలు కలగలిసిన ప్రేమకథ ఇది. ఇందులో మూడు జంటల ప్రేమకథలు చూడొచ్చు. ముగ్గురు తండ్రుల పెంపకాల్లోని లోటుపాట్లనీ చూడొచ్చు. ప్రేక్షకులు ఏదో ఒకరకంగా ఈ కథతో కనెక్ట్‌ అవుతారు. ఈమధ్య కాలంలో ‘పిఠాపురం’ అనేది ఎంతలా మారుమోగిందో అందరికీ తెలిసిందే. ఆ పిఠాపురం నేపథ్యంలోనే సినిమా అంతా సాగుతుంది. పిఠాపురం పరిసర ప్రాంతాల్లో 28 రోజులు, హైదరాబాద్‌లో 15 రోజులు, గోవాలో 6 రోజులు చిత్రీకరణ జరిపాం. ఇందులో మొత్తం మూడు పాటలు ఉంటాయి. పాటలు చాలా బాగా వచ్చాయి. గోవాలో ఒక పాటను, హైదరాబాద్‌లో సెట్‌వేసి ఇంకో పాటను, సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్‌లో మరో పాటను చిత్రీకరించాం. దర్శకునిగా నాకు జీవితాన్ని ప్రసాదించిన ‘మూవీమొఘల్‌’ డి. రామానాయుడు స్ఫూర్తితో కథను నమ్మి, ఎక్కడా వేస్టేజ్‌ లేకుండా ఈ సినిమా తీశాం. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’ అని తెలిపారు.

Next Story