'ది ప్యారడైజ్'కు సూపర్ ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు

by Pulgam srinivas |

'ది ప్యారడైజ్' మూవీ థియేట్రికల్ హక్కుల కోసం దిల్ రాజు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

ది ప్యారడైజ్కు సూపర్ ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకవైపు సినిమాలను నిర్మిస్తూనే, మరోవైపు భారీ చిత్రాల పంపిణీ హక్కులను సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తున్నారు. దీంతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజా సమాచారం ప్రకారం, దిల్ రాజు ప్రస్తుతం ఓ క్రేజీ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు.. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్'. ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చేరుకురి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకునేందుకు దిల్ రాజు భారీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా నిర్మాతలకు ఆకర్షణీయమైన ఆఫర్ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చివరికి 'ది ప్యారడైజ్' థియేట్రికల్ హక్కులు దిల్ రాజు సొంతమవుతాయా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.

Next Story