టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిర్మాత గొట్టిముక్కల పద్మారావు కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-21 05:13:26  IST  )

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిర్మాత గొట్టిముక్కల పద్మారావు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు రాజకీయ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఉద్యమ నేత గొట్టిముక్కల పద్మారావు (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.

కాగా, గొట్టిముక్కల పద్మారావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పద్మప్రియ ఆర్ట్స్ (Padma Priya Arts) అనే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థను స్థాపించి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించారు. సీనియర్ హీరో సుమన్‌తో ‘కంచు కవచం’ యాక్షన్ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ‘జోకర్’, నేటికీ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించే క్లాసిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఏప్రిల్ 1 విడుదల’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు పద్మారావు గారు అందించారు. దీంతో ఆయన మృతి పట్ల టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు, నటులతో పాటు రాజకీయ నాయకులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయితే, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి రోజునే పద్మారావు మృతి చెందడం గమనార్హం.

రాజకీయ ప్రస్థానం ఇలా..

1996లో గొట్టిముక్కల పద్మారావు తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి విశేషంగా కృషిచేశారు. ఆ సమయంలో జన్మభూమి కాలనీ పేరిట పేదలకు ఇళ్లు కట్టించడంతో పాటు, పలు అభివద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. తరువాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. కూకట్‌పల్లి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్‌గా పనిచేసి, పార్టీ బలోపేతానికి విశేషంగా కృషిచేశారు. 2014లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి, తెలుగుదేశం అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఓడిపోయారు. 2015లో హైదరాబాద్ నగర మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కీలకపాత్ర పోషించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టికెట్ అశించిన పద్మారావు, సీటు రాకపోవడంతో 2018 నవంబరు 18న టీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు.

ఇక 2019 ఏప్రిల్ 1న జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుపుకు కృషిచేశారు. 2022 నవంబరు 2న రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో భాగంగా బోయినపల్లి నుంచి మియాపూర్ వరకు జరిగిన యాత్రలో గొట్టిముక్కల పద్మారావు పాల్గొన్నారు.

Next Story