సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. నటుడు, కెమెరామెన్ దుర్మరణం

by Kema Shiva Kumar |

హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 'టెనెంట్' సినిమా హీరో భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ దుర్మరణం పాలయ్యారు.

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. నటుడు, కెమెరామెన్ దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటుడు భరత్ కాంత్ (31), ప్రముఖ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ (31) దుర్మరణం పాలయ్యారు. ఒకేసారి ఇద్దరు యువ ప్రతిభావంతులు ప్రాణాలు కోల్పోవడంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.

ప్రమాదం జరిగిందిలా..

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. సొంతూరైన నెల్లూరుకు వెళ్లిన వారిద్దరూ శనివారం రాత్రి అక్కడి నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. పెద్ద అంబర్‌పేట్‌ వద్ద ఓఆర్‌ఆర్‌ ఎక్కి శంషాబాద్‌ వైపు వెళ్తుండగా... బొంగుళూరు ఎగ్జిట్‌ 12 వద్ద ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఓ కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో భరత్‌ కాంత్, త్రిలోక్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

'టెనెంట్' సినిమాతో గుర్తింపు

భరత్ కాంత్ ఇటీవల విడుదలైన 'టెనెంట్' (Tenant) చిత్రంలో కథానాయకుడిగా నటించి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అంతకు ముందు పలు చిత్రాల్లో సహాయక నటుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. హీరోగా ఎదుగుతున్న తరుణంలోనే ఈ ప్రమాదం జరగడం ఆయన అభిమానులను కలచివేస్తోంది. మరోవైపు, మృతుల్లో ఒకరైన త్రిలోక్ పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇద్దరూ 31 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు వీరి మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.

Next Story