‘ధురంధర్’ దర్శకుడికి హైకోర్టులో బిగ్ రిలీఫ్: స్క్రిప్ట్ చోరీ ఆరోపణలపై స్టే

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-08 17:37:20  IST  )

స్క్రిప్ట్ దొంగిలించారంటూ ‘ధురంధర్’ దర్శకుడు ఆదిత్య ధర్‌పై వస్తున్న ఆరోపణలకు బాంబే హైకోర్టు చెక్ పెట్టింది.

‘ధురంధర్’ దర్శకుడికి హైకోర్టులో బిగ్ రిలీఫ్: స్క్రిప్ట్ చోరీ ఆరోపణలపై స్టే
X

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్‌పై వస్తున్న స్క్రిప్ట్ చోరీ ఆరోపణల విషయంలో బాంబే హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేయకుండా మరో ఫిల్మ్ మేకర్ సంతోష్ కుమార్‌పై కోర్టు మధ్యంతర స్టే విధించింది. అయితే, బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘ధురంధర్’ దాని సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాల స్క్రిప్ట్‌ను ఆదిత్య ధర్ తన నుంచి దొంగిలించారని సంతోష్ కుమార్ గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. తన వద్ద రిజిస్టర్ అయి ఉన్న ‘డి సాహెబ్’ (D Saheb) అనే కథనే ఆదిత్య ధర్ కాపీ కొట్టారని ఆయన పేర్కొన్నారు.

ధర్మాసనం కీలక ఆదేశాలు..

పిటిషనర్ సంతోష్ కుమార్ చేస్తున్న ఆరోపణలు తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయంటూ ఆదిత్య ధర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఆరిఫ్ డాక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సంతోష్ కుమార్ ఇవే తరహా ఆరోపణలను లేదా వ్యాఖ్యలను మీడియాలో కానీ, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కానీ చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఆదిత్య ధర్ దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించిన కోర్టు, కేసులో స్టే విధిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. ఆదిత్య ధర్ ఇదివరకే సంతోష్ కుమార్‌కు లీగల్ నోటీసులు పంపినప్పటికీ, ఆయన స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. బాలీవుడ్‌లో ఇటీవల స్క్రిప్ట్ చోరీ వివాదాలు ఎక్కువవుతున్న తరుణంలో హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Next Story