‘మహాకాళి’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన భూమి శెట్టి.. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలను అందించిందంటూ పోస్ట్

by Mallepaka Hamsa |

కోల్‌కతాలో గడిపిన 12 రోజులు తనకు ఒక రోలర్ కోస్టర్ ప్రయాణంలా అనిపించిందని ఆమె పేర్కొంది.

‘మహాకాళి’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన భూమి శెట్టి.. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలను అందించిందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: కన్నడ భామ భూమి శెట్టి ‘నిన్నే పెళ్లాడతా’ అనే తెలుగు సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టింది. టాలీవుడ్‌లో ‘కింగ్‌డమ్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఇప్పుడు తన రెండో చిత్రంతోనే ఏకంగా ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో భాగమైంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మహాకాళి’లో భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోంది. పూజా కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా.. తాజాగా కోల్‌కతాలో ఒక ముఖ్యమైన షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ సందర్భంగా భూమి శెట్టి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. కోల్‌కతాలో గడిపిన 12 రోజులు తనకు ఒక రోలర్ కోస్టర్ ప్రయాణంలా అనిపించిందని ఆమె పేర్కొంది. షూటింగ్ బిజీలోనూ సమయం దొరికినప్పుడల్లా అక్కడి వీధుల్లో తిరుగుతూ, స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వారి సంస్కృతిని, చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నించానని చెప్పింది.

కళలకు పుట్టినిల్లైన కోల్‌కతా నగరం తనకు ఎప్పటికీ మరుపురాని జ్ఞాపకాలను అందించిందని భూమి శెట్టి సంతోషం వ్యక్తం చేసింది. అలాగే తన అనుభవాన్ని త్వరలోనే పోస్ట్ ద్వారా పంచుకుంటానని చెప్పింది. కాగా.. ఈ సినిమా భారతీయ పురాణాల నేపథ్యంలో, బెంగాల్ సంస్కృతి ఆధారంగా రూపొందుతోంది. ఇండస్ట్రీలో ఇదొక పవర్‌ఫుల్ లేడీ సూపర్ స్టార్ ఓరియెంటెడ్ చిత్రంగా నిలుస్తుందని చిత్రబృందం భావిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. కేవలం భూమి శెట్టి మాత్రమే కాకుండా, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ ఖన్నా అసురగురువు శుక్రాచార్యుడి పాత్రలో నటిస్తుండటం విశేషం. అలాగే యంగ్ హీరో రోహిత్ సరాఫ్ కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఇటీవల ప్రశాంత్ వర్మ అధికారికంగా ప్రకటించారు.

Next Story