మీ జీవితానికి మీరే హీరో అవ్వండి తర్వాతే పెళ్లి.. యువతులకు కంగన పవర్ ఫుల్ సలహా

by Mallepaka Hamsa |

ఈ రోజుల్లో ప్రతిరోజూ ఎంతోమంది వివాహితలు, యువతుల జీవితాల్లోని కష్టాలు వెలుగులోకి వస్తున్నాయి.

మీ జీవితానికి మీరే హీరో అవ్వండి తర్వాతే పెళ్లి.. యువతులకు కంగన పవర్ ఫుల్ సలహా
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఓవైపు రాజకీయాల్లో రాణిస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ దూసుకుపోతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, సమాజంలో జరిగే పలు విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. తాజాగా, కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా నేటి తరం యువతులకు కొన్ని అత్యంత కీలకమైన సూచనలు చేసింది. "ఈ రోజుల్లో ప్రతిరోజూ ఎంతోమంది వివాహితలు, యువతుల జీవితాల్లోని కష్టాలు వెలుగులోకి వస్తున్నాయి. చదువుకున్న చాలామంది యువతులు తమ జీవితాలు పూర్తిగా నాశనం కాకముందే.. ఊపిరాడనంతటి క్లిష్ట పరిస్థితుల నుండి తమను బయటపడేయమని కన్నతల్లిదండ్రులను వేడుకుంటున్నారు. కానీ, మన భారతీయ సమాజంలో కూతుళ్లకు పెళ్లి చేసిన తర్వాత వారిని పూర్తిగా వదిలివేయడంలో ఒక చెడ్డ పేరుంది" అని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ సమస్యలపై యువతులకు సలహా ఇస్తూ.. "సోషల్ మీడియా గానీ, ఫ్యాషన్, డేటింగ్, పెళ్లి లేదా మేకప్ పరిశ్రమలు ఏవీ కూడా మీకు ఈ నిజాన్ని చెప్పవు. మీ జీవితంలో మరేదాని కంటే కూడా మీ కెరీర్, మీ ఆర్థిక స్వాతంత్ర్యం చాలా ముఖ్యం. మీరు సొంతంగా నిలబడి, స్వతంత్రంగా మారిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి. దయచేసి మీ జీవితానికి మీరే హీరోగా మారాలి. మీరు రేపు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు అనే దానికంటే.. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు, సమాజంలో మీ గుర్తింపు ఏంటి అనేదే చాలా ముఖ్యం. మీరు కోరుకున్న జీవితాన్ని మీరే సొంతంగా నిర్మించుకోండి, ఎవరి మాటలు వినకండి" అని కంగనా రనౌత్ రాసుకొచ్చింది. ప్రస్తుతం కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను కంగనా ప్రాక్టికల్‌గా చెప్పిందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story