డబ్బులు ఇస్తున్నారు కాబట్టి విమర్శించే హక్కు ప్రేక్షకులకు ఉంది: త్రిప్తి డిమ్రి

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-31 10:58:13  IST  )

ప్రేక్షకులు డబ్బులు పెట్టి మనల్ని స్క్రీన్‌పై చూడటానికి వస్తున్నారు కాబట్టి, మన నటనను విమర్శించే హక్కు వారికి ఖచ్చితంగా ఉంటుందని త్రిప్తి అభిప్రాయపడింది.

డబ్బులు ఇస్తున్నారు కాబట్టి విమర్శించే హక్కు ప్రేక్షకులకు ఉంది: త్రిప్తి డిమ్రి
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ‘యానిమల్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని విపరీతమైన క్రేజ్ రాబట్టుకుంది. ఆ తర్వాత నుంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తన నటనతో అందరినీ మంత్రముగ్దులను చేస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్‌ ఇండస్ట్రీల్లో బ్యాక్ టు బ్యాక్ చాన్సులు పొందుతూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’లో త్రిప్తి హీరోయిన్‌గా నటిస్తూ.. ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి నటీనటులపై వచ్చే విమర్శల గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాలు విడుదలయ్యే సమయంలో నటీనటులకు ఉండే ఆందోళన గురించి త్రిప్తి మాట్లాడుతూ.. మనం ఏదైనా ఒక పని చేసి, దాని కోసం ఎంతో సమయం, శ్రమ వెచ్చించినప్పుడు అలాంటి భయం కలగడం చాలా సహజమని ఆమె చెప్పింది.

దీనికి ఉదాహరణగా స్కూల్‌లో ఎగ్జామ్స్ రాశాక రిజల్ట్స్ కోసం ఎదురుచూసేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో, సినిమా రిలీజ్ అప్పుడు కూడా అలాగే ఉంటుందని వివరించింది. అయితే, మనం చేసిన పని గురించి జనాల మధ్య చర్చ జరగడం మంచిదేనని, అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా నటులుగా దాన్ని అంగీకరించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రేక్షకులు డబ్బులు పెట్టి మనల్ని స్క్రీన్‌పై చూడటానికి వస్తున్నారు కాబట్టి, మన నటనను విమర్శించే హక్కు వారికి ఖచ్చితంగా ఉంటుందని త్రిప్తి అభిప్రాయపడింది. అయితే, నటనను కాకుండా వ్యక్తిగత విషయాలను లేదా వేరే అంశాలను మధ్యలోకి లాగి విమర్శలు చేసినప్పుడు మాత్రం తనకు చాలా చిరాకు వస్తుందని, అది ఎంతమాత్రం సరికాదని తన ఆవేదనను వ్యక్తం చేసింది. కేవలం పనిపై మాత్రమే విమర్శలు ఉంటే బాగుంటుందని త్రిప్తి ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కిల్లర్ పాత్రలో ఆలియా భట్.. వైరల్ అవుతున్న న్యూస్‌తో ‘ఆల్ఫా’పై భారీ హైప్

Next Story