పవర్‌ఫుల్ పాత్ర లభించినప్పుడు వయస్సుతో సంబంధమే లేదు.. ట్రోలర్స్‌కు భాగ్యశ్రీ స్ట్రాంగ్ కౌంటర్

by Mallepaka Hamsa |

రాజమాత జిజాబాయి లాంటి అత్యంత శక్తివంతమైన, పవర్‌ఫుల్ పాత్ర లభించినప్పుడు ఇక వయస్సు వ్యత్యాసాలతో అస్సలు సంబంధం లేదు.

పవర్‌ఫుల్ పాత్ర లభించినప్పుడు వయస్సుతో సంబంధమే లేదు.. ట్రోలర్స్‌కు భాగ్యశ్రీ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, సినిమా: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం ‘రాజా శివాజీ’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ స్వయంగా దర్శకత్వం వహించి, శివాజీ మహారాజ్ పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే, ఈ సినిమాలో శివాజీ తల్లి అయిన రాజమాత జిజాబాయి పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ నటించారు. సినిమాలో ఆమె నటనకు, ఆ పవర్‌ఫుల్ పాత్రకు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభిస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. నిజజీవితంలో రితేష్ దేశ్‌ముఖ్ (47) కంటే భాగ్యశ్రీ (57) 10 ఏళ్లు పెద్దది. దీంతో అంత చిన్న వయసు ఉన్న నటుడికి తల్లిగా నటించడం ఏంటంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై నటి భాగ్యశ్రీ స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

"మనం చిన్నప్పటి నుంచి వింటూ, చదువుకుంటూ పెరిగిన చారిత్రాత్మక మహానీయుల కథల్లో ఒక గొప్ప పాత్ర పోషించే అవకాశం వస్తే.. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేం. రాజమాత జిజాబాయి లాంటి అత్యంత శక్తివంతమైన, పవర్‌ఫుల్ పాత్ర లభించినప్పుడు ఇక వయస్సు వ్యత్యాసాలతో అస్సలు సంబంధం లేదు. నటనకు ప్రాధాన్యమున్న ఒక గొప్ప పాత్ర కాబట్టే.. నాకంటే కేవలం పదేళ్లు చిన్నవాడైన రితేష్‌కు తల్లిగా నటించడానికి ఒప్పుకున్నాను. ఇందులో నాకు ఎలాంటి తప్పుగానీ, అభ్యంతరంగానీ అనిపించలేదు" అని భాగ్యశ్రీ స్పష్టం చేశారు. ఈ కాలంలో వయసు అనేది ఒక పెద్ద సమస్యే కాదని భాగ్యశ్రీ వివరించారు. "ఇప్పుడున్న అడ్వాన్స్‌డ్ కెమెరా లైటింగ్, సరికొత్త టెక్నిక్స్, మరియు అద్భుతమైన మేకప్ ద్వారా స్క్రీన్ మీద నన్ను రితేష్ కంటే కొంచెం వయసు పైబడినట్లుగా చాలా సహజంగా చూపించారు. నటీనటులుగా మా బాధ్యత పాత్రకు న్యాయం చేయడమే" అని చెప్పుకొచ్చారు.

Next Story