సింప్లీ ‘టెనెట్’

by  |
సింప్లీ ‘టెనెట్’
X

దిశ, వెబ్‌డెస్క్: టెనెట్..ఈ పేరు ఉన్నది మూడు అక్షరాలే. కానీ, ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. నిజానికి క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు అన్నీ అలాగే ఉంటాయనుకోండి. ఆయనకు టైమ్ అంటే పిచ్చి. అందుకే ఆయన సినిమాల్లో టైమ్‌తో ఆటలు ఆడుతుంటాడు. మెమొంటో, ఇన్సెన్షన్, ఇంటర్‌స్టెల్లార్, డంక్రిక్..ఇప్పుడు టెనెట్. ఆయన సినిమాలు చూసిన వెంటనే అందులో కాన్సెప్ట్‌లు అర్థం చేసుకోవడానికి కచ్చితంగా గూగుల్ సెర్చ్ చేయాల్సిందే. ఇప్పుడు టెనెట్ మూవీ విషయంలో కూడా అదే జరుగుతోంది. అయితే అందరూ ఇక్కడ సినిమా స్టోరీని పక్కన పెట్టి టైమ్ ఇన్వెర్షన్, ఎంట్రోపీ, థర్మోడైనమిక్స్ సిద్ధాంతాల గురించి అన్వేషిస్తున్నారు. సినిమా కథకు తగినట్లుగా ఈ కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవాలి. కానీ, ఇలా విడివిడిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఉన్న మతి పోతుంది. ఈ సినిమా చూడటానికి ఫిజిక్స్‌లో మాస్టర్ డిగ్రీ అవసరం లేదు.. ఈ సినిమాను ఎంజాయ్ చేయడానికి అవసరమైన బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. అందుకే ఈ కాన్సెప్ట్‌ల గురించి లోతుగా అర్థం చేసుకోకుండా, సినిమాను ఆస్వాదించడానికి అవసరమైన వరకు నేర్చుకుందాం.

ముందు సినిమా బ్యాక్ స్టోరీ విషయానికి వస్తే..ఇందులో విలన్ భవిష్యత్తు, హీరో వర్తమానం. అంటే ప్రస్తుతం భూమ్మీద ఉన్న ప్రజలు వనరులను ఎక్కువగా వినియోగించి వాతావరణ మార్పులకు కారణమవడం, అణుకేంద్రాల నిర్మాణం కారణంగా భవిష్యత్తు ప్రజలకు దుర్భర పరిస్థితులు వస్తాయి. అందుకే భవిష్యత్తులో ఒక సైంటిస్ట్ టైమ్‌ను ఇన్వర్షన్ చేసే అల్గారిథమ్‌ను కనిపెడుతుంది. ఈ అల్గారిథంతో భవిష్యత్తులో ఎలాంటి మార్పులు గతంలో జీవించిన వారిని అంతం చేసి, వనరులను తిరిగి పొందవచ్చు. గ్రాండ్‌ఫాదర్ పారడాక్స్‌ను భవిష్యత్తు ప్రజలు పట్టించుకోలేదు. అంటే ఒక వ్యక్తి గతంలోకి వెళ్లి తన తాతయ్యను చంపితే, తాను కూడా ఉనికి నుంచి అంతర్థానమవుతాడనే విషయమే గ్రాండ్‌ఫాదర్ పారడాక్స్. అయితే ఈ విషయాన్ని తర్వాత అల్గారిథమ్‌ను కనిపెట్టిన సైంటిస్ట్ అర్థం చేసుకుని, దాన్ని అమలు చేయొద్దని నిర్ణయించుకుంటుంది. తన అల్గారిథం ఎవరి కంటపడినా మళ్లీ అమలు చేస్తారని తెలిసి, దాన్ని ఎనిమిది భాగాలుగా చేసి దాచి పెడుతుంది. ఎవరికీ దొరకవద్దనే ఉద్దేశంతో గతానికి తిరిగి వచ్చి, అత్యంత భద్రత గల ఎనిమిది న్యూక్లియర్ కేంద్రాల్లో దాచి పెడుతుంది. ఇదేదీ సినిమాలో దృశ్యరూపకంగా కనిపించదు. కాబట్టి విజువల్ ఎఫెక్ట్‌ల గందరగోళంలో పడి ఈ విషయం పట్టించుకోవడం మర్చిపోతారు.

ఆ సైంటిస్ట్ ఎనిమిది భాగాలను దాచి పెట్టిన గతమే ప్రస్తుత వర్తమానం. భవిష్యత్తు వాళ్లు, వర్తమానం మీద చేయబోయే ఈ దారుణాన్ని సినిమాలో మూడో ప్రపంచ యుద్ధంగా అభివర్ణిస్తారు. ఈ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికే టెనెట్ ఏర్పడుతుంది. ఈ ఎనిమిది భాగాలను సేకరించి అల్గారిథాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి భవిష్యత్తుకు చెందిన వాళ్లు, వర్తమానంలో ఉన్న ఆండ్రే సేటర్‌తో ఒప్పందం చేసుకుంటారు. తనకు దక్కనిది ఎవరికీ దక్కొద్దు అనుకునే స్వభావం గల ఆండ్రే సేటర్, తనకు కేన్సర్ ఉందని తెలిశాక తనతోపాటు వర్తమానాన్ని అంతం చేయాలని డిసైడ్ అయ్యి, ఎనిమిది భాగాల్లో ఏడు భాగాలను విజయవంతంగా సేకరిస్తాడు. ఈ చివరి ఒక్క భాగాన్ని సేటర్ సేకరించాలనుకోవాలనుకోవడం, మన హీరోలు ఆపాలనుకోవడమే ఈ సినిమా కథ. అయితే టైమ్ ఇన్వెర్షన్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఇది ఒక సాధారణ జేమ్స్ బాండ్ లేదా మిషన్ ఇంపాజిబుల్ సినిమాలాగే ఉండేది. కానీ, సంక్లిష్టమైన ఈ కాన్సెప్ట్ కారణంగానే ఇప్పుడు అందరూ బుర్రలు గోక్కుంటున్నారు.

ఇక ఫిజిక్స్ అంశాల విషయానికి వస్తే విశ్వంలో ప్రతి వస్తువుకు ఎంట్రోపీ ఉంటుంది. దానిలో అణువుల కదలిక ఆధారంగా ఈ ఎంట్రోపీ ఏర్పడుతుంది. ఏదైనా వస్తువుకు కానీ, మనిషికి కానీ ఎంట్రోపీని రివర్స్ చేయడం వల్ల నేరుగా నడుస్తున్న వాళ్లకి అవి రివర్స్ అయినట్లుగా కనిపిస్తాయి. సాధారణంగా కాజ్ తర్వాత ఎఫెక్ట్ ఉండాలి. కానీ, రివర్స్ ఎంట్రోపీ వల్ల ముందు ఎఫెక్ట్ జరిగి తర్వాత కాజ్ ఉంటుంది. ఇలా చేయగలగడం వల్లనే టైమ్ ఇన్వెర్షన్ సాధ్యమవుతుంది. సినిమా అర్థం చేసుకోవడానికి ఈ మాత్రం చాలు. ఇక మళ్లీ సినిమా కథ విషయానికి వస్తే..టైమ్ ఇన్వెర్ట్ చేయబడిన బుల్లెట్ తయారైన పదార్థాల ఆధారంగా అవి ఇండియా నుంచి వచ్చాయని హీరో తెలుసుకుంటాడు. తర్వాత కొన్ని కాంటాక్ట్‌ల ద్వారా ఆండ్రే సేటర్ భార్య వరకు వెళ్లగలుగుతాడు. ఆమె సాయంతో ఆండ్రే సేటర్‌ను కలుస్తాడు. ఈ క్రమంలో ఆండ్రే సేటర్ వ్యక్తిగత, వృత్తిగత విషయాలను విశ్లేషించి తన పని సాధ్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే… టైమ్‌ను ఇన్వర్ట్ చేసే మెషీన్లు.

ఈ మెషీన్ల ద్వారా మన హీరోలు చేయబోయేవి ఆండ్రే ముందే తెలుసుకోవడం, హీరోలు కూడా ఆ మెషీన్ల ద్వారానే ఆండ్రే చేయబోయేది తెలుసుకోవడం ఇలా ఒకరి పైఎత్తు మరొకరి తెలియడం, మధ్యలో ఆండ్రే సేటర్ భార్యను పావుగా వాడుకోవడం, ఆ క్రమంలో టైమ్ ఇన్వెర్షన్ వల్ల కలిగే ప్రభావాలతో సన్నివేశాలన్నీ ఒక గందరగోళాన్ని సృష్టించిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. టైమ్ ఇన్వెర్షన్, టైమ్ ట్రావెల్ రెండూ ఒకటి కావు. ఈ తేడా తెలియని కారణంగా రెండు సార్లు చూస్తే తప్ప సరిగ్గా సినిమా అర్థం కాదు. అంతేగాకుండా ముఖ్యమైన ఫైట్ సీన్లను ఒకసారి మామూలుగా, ఒకసారి ఇన్వెర్టెట్ టైమ్‌లైన్‌లో చూపించడం ద్వారా ఏది ఎప్పుడు ఎందుకు ఎవరిని ఎలా కొడుతున్నారో చూసే లోపే సీన్ అయిపోతుంది. అందుకే అందరూ ఫిజిక్స్ కాన్సెప్ట్‌లు అర్థమైతేనే సినిమా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఉన్నారు. కథకు లింక్ చేసి చూడగలిగితే ఇవేమీ పెద్ద కాన్సెప్ట్‌లుగా అనిపించవు. వీటి గురించి లోతుగా తెలుసుకోవడానికి చాలా వీడియోలు ఉన్నాయి. ఈ సినిమా ద్వారా క్రిస్టోఫర్ నోలన్ చెప్పాలనుకుంటున్నది ఫిజిక్స్ కాదు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్. అందుకే ఇకనైనా ఫిజిక్స్ అంశాల గురించి కాకుండా, క్లైమేట్ చేంజ్, అణ్వాయుధాలు, కాలుష్యం, సుస్థిరాభివృద్ధి, భవిష్యత్ తరాలకు వనరుల గురించి సెర్చ్ చేస్తే మంచిది. లేకపోతే ఏమో మన భవిష్యత్తు తరాలు నిజంగానే ఇలాంటి అల్గారిథం తయారు చేసి మనల్ని అంతం చేస్తాయేమో!


Next Story

Most Viewed