తొలి ధృవపు ఎలుగుబంట్ల హోటల్.. ఏం సర్వ్ చేస్తున్నారో తెలుసా?

by  |
తొలి ధృవపు ఎలుగుబంట్ల హోటల్.. ఏం సర్వ్ చేస్తున్నారో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ఆర్కిటిక్ సముద్ర తీర ప్రాంతాలు, సరస్సుల్లో నివసించే అరుదైన వన్యప్రాణి ‘ధృవపు ఎలుగుబంటి’. సరస్సుల మధ్య మంచు ప్రదేశాల్లో మైళ్ల దూరం నడుస్తూ జీవించే ఈ జంతువుల కోసం హోటల్‌ను ప్రారంభించారు. రెండు ధ్రువ ఎలుగుబంట్లను ఆ హోటల్‌లో ప్రదర్శనకు ఉంచగా, వాటిని చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. ప్రపంచంలోనే తొలిసారి ధ్రువ ఎలుగుబంట్ల కోసం ప్రత్యేకంగా సృష్టించిన ఆ హోటల్‌ను చైనాలోని ఉత్తర ఈశాన్య ప్రావిన్స్ హీయిలంగ్‌ జియాంగ్‌లో ఏర్పాటు చేశారు.‘హర్బిన్ పోలార్ ల్యాండ్(Harbin Polar land)’ పేరుతో 2005లో ధ్రువపు ఎలుగుబంట్ల ప్రదర్శన కోసం ప్రపంచ తొలి ఆర్ట్స్ అమ్యూజ్‌మెంట్ పార్కును స్థాపించగా.. ఈ పార్క్ నిర్వాహకులే హోటల్‌ను ప్రారంభించారు. వన్యప్రాణి అయిన ధ్రువపు ఎలుగుబంటిని ప్రజలను చూపేందుకు ఈ ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం సందర్శకులతో కిటకిటలాడుతోంది. కాగా టికెట్ ధర రూ.25 వేలు అయినా సరే సందర్శకులు వస్తూనే ఉన్నారని, బుకింగ్స్ ఫుల్ అవుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కాగా శుక్రవారం ఓపెన్ అయిన హోటల్‌లో ఎలుగుబంట్లు ఎలా నడుస్తున్నాయి? ఎలా పడుకుంటున్నాయి? ఏ విధంగా తింటున్నాయి? క్లియర్‌గా వీక్షించేందుకు వీలుగా.. ఎలుగుబంట్లున్న ప్రదేశం స్పష్టంగా కనిపించేలా మొత్తం 21 గెస్ట్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

అయితే పర్యావరణ కార్యకర్తలు ఎలుగుబంట్లను హోటల్లో ప్రదర్శనకు ఉంచడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్కిటిక్ సముద్ర తీర ప్రాంతాలు, సరస్సులు, మంచు ప్రదేశాల్లో నివసించే ప్రాణులను ఇలా బంధించడం సరికాదని పెటా సంస్థ కార్యకర్తలు మండిపడుతున్నారు. రోజులో 18 గంటలు యాక్టివ్‌గా ఉంటూ వేల మైళ్లు నడిచే జంతువులు.. ఇలా ఒకే చోట ఉండిపోవడం వల్ల వాటి మనుగడ ప్రమాదంగా మారే పరిస్థితి తలెత్తొచ్చని చెబుతున్నారు.



Next Story