నోరు జారిన కేసీఆర్… ఆ ఉద్యోగుల నుండి ఊహించని షాక్

2058
Chief-Minister-KCR

దిశ, తెలంగాణ బ్యూరో: “మానవీయ కోణంలో ఆలోచించి.. హోం గార్డులుంటరు.. మీకు తెలుసు. ఇయ్యాల దగ్గర దగ్గర యాభై వేల రూపాయల జీతం ఇస్తున్నం. ఏ రాష్ట్రంలో ఇయ్యలే ఇండియాలో’’ అని జూలై 30న తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రసంగంలో అందరికీ తెలిసిందే.

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో హోం గార్డులకు నెలకు రూ.50 వేల చొప్పున జీతం ఇస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. స్వయంగా హోంగార్డులే ఈ ప్రకటనను పచ్చి అబద్ధంగా అభివర్ణిస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా తమకు రూ.50 వేలు అందడం లేదని, రూ. 24 వేలు మాత్రమే వస్తున్నాయని పలువురు హోంగార్డులు ధృవీకరించారు. కేసీఆర్ చెప్పిన మాటల్లో నిజం లేదని, దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. లేనట్లయితే తెలంగాణ సమాజం మొత్తం నిజంగానే హోంగార్డులు నెలకు రూ. 50 వేలు అందుకుంటున్నారనే అభిప్రాయం నెలకొంటుందని పేర్కొన్నారు. లేదా ఆయన చెప్పినట్లుగా ఇక నుంచి తమ వేతనాన్ని రూ. 50 వేలు చేయాలని కోరారు.

Telangana-Home-Guards

“హోంగార్డులకు నెలకు రూ. 50 వేలు ఇస్తున్నారన్నది వట్టి మాటే. ఆయన చెప్పినదాంట్లో సగం కూడా వస్తలేదు. మాకు వచ్చే జీతం రూ.24,240 మాత్రమే. రోజుకు రూ. 808 చొప్పున ఇస్తారు. నెలలో ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేస్తేనేపై జీతం వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ పెంచారు కాబట్టి దాన్ని మాకు కూడా వర్తింపజేస్తే రూ.31,000 వస్తుంది. కానీ ఎప్పటి నుంచి మాకు వర్తింపజేస్తారో తెలియదు. ఇంకా నయం.. నేను యాభై వేల జీతం తీసుకుంటూ ఇంట్లో రూ. 24 వేలు మాత్రమే ఇస్తున్నావంటూ భార్యతో గొడవ కాలేదు. సీఎం ప్రకటనతో భార్యాభర్తల మధ్య తేడాలు వచ్చే అవకాశాలూ ఉన్నాయి’’ అని ఓం హోంగార్డు వివరించారు.

బీజేపీ నాయకుడు పెద్దిరెడ్డి ఆ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా శుక్రవారం తెలంగాణ భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. హోంగార్డులకు వాస్తవంగా అందుతున్న జీతాలు, వారి ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి కోరుకుంటున్న అంశాలపై ‘దిశ’ ఆ సేవలందిస్తున్న పలువురిని పలకరించి వివరాలను సేకరించింది. కానీ వారికి ఉన్నతాధికారుల నుంచి వచ్చే వేధింపులు, ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని వారి పేర్లను ప్రచురించడంలేదు. నిజంగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను విని తాము షాక్‌కు గురయ్యామని ఓ హోంగార్డు పేర్కొన్నారు. సీఎం చెప్పినట్లుగా తమకు రూ.50 వేలు వేతనం ఇవ్వాలని లేదంటే అవన్నీ అబద్ధాలని ఒప్పుకోవాలని పేర్కొన్నారు.

అడ్డా కూలీ డ్యూటీయే మాది

“పేరుకే పోలీస్ లాంటి విధులు. కానీ రోజూవారీ అడ్డా కూలీలకంటే అధ్వానమైన పరిస్థితి మాది. అత్యవసర పనులకూ సెలవులు దొరకవు. ఉద్యోగులకు ఉండేలాంటి క్యాజువల్ లీవ్‌లు కూడా ఉండవు. డ్యూటీకి వెళ్లకుంటే ఆ రోజు వేతనంలో కోత తప్పదు. రోజూవారీ వేతనంగా మాత్రమే పనిచేసిన రోజుకు రూ.808 చొప్పున లెక్కగట్టి ఇస్తున్నారు. నెల మొత్తం సెలవు లేకుండా పనిచేస్తే మాకు వచ్చేది రూ.24,240. ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన 30 శాతం పీఆర్సీ పెంపును కలిపి ఇచ్చినట్లయితే అందేది రూ. 31,000“ అని ఒక హోంగార్డు వివరించారు. ముఖ్యమంత్రి యాభై వేల రూపాయలు అని చెప్పడంతో చాలా మంది నమ్మేశారు. నిజంగా హోంగార్డులు ప్రతి నెలా రూ. 50 వేల చొప్పున తీసుకుంటున్నారనే అభిప్రాయం ఏర్పడింది.

చాలీ చాలనీ వేతనాలతో కుటుంబపోషణ భారంగా తయారైందని ఓ హోంగార్డు ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం వాయిదా పద్ధతిని పాటిస్తూ ఉన్నదని వాపోయారు. రెండు నెలలుగా అందలేదు కాబట్టి ఆగస్టు నుంచైనా వస్తుందేమోననే ఆశతో ఉన్నామని పేర్కొన్నారు. చేతికి వచ్చిందాకా అనుమానమేనని పేర్కొన్నారు.

కనీస గుర్తింపు కరువు

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19,000 మంది హోం గార్డులున్నారు. వారికి ప్రభుత్వం చాలామందికి ఐడీ కార్డులు కూడా లేవు. ఆరోగ్య భద్రత కల్పిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ప్రాణాపాయ స్థితిలో వైద్య చికిత్స భారమవుతోందని, హెల్త్ కార్డులు కూడా లేకపోవడంతో చాలీచాలని జీతంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్ పాస్ ఇస్తామని ప్రకటించినా ఇప్పటికీ వాటికి గతిలేదన్నారు. హోంగార్డులంటే ఉన్నతాధికారులకు చాలా చిన్నచూపు అని, కానిస్టేబుల్ దగ్గరి నుంచి ఐపీఎస్ స్థాయి వరకు అందరూ పెత్తనం చేసేవారేనన్నారు. వృత్తి ఎలా ఉన్నా కనీసం మనిషిగా చూస్తే బాగుండని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుందని కానీ పోలీసు శాఖలో అలాంటిది ఆశించలేమన్నారు.

వర్తించని బెనిఫిట్స్

రెగ్యులరైజ్ చేయకపోవడంతో రిటైర్ అయినా, మరణించినా ప్రభుత్వ ఉద్యోగులకు అందే బెనిఫిట్స్ ఏవీ పొందే అవకాశం లేదని ఒక హోంగార్డు తన ప్రాక్టికల్ సమస్యను ప్రస్తావించారు. ఈ కొలువులో ప్రమోషన్లు ఉండవని, ఎన్నేండ్లు పనిచేసినా హోంగార్డులుగానే ఉండిపోవాలన్నారు. ఏదైనా ప్రాంతానికి డిప్యూటేషన్‌పై పంపిస్తే ఇక వెళ్ళక తప్పదని, కుటుంబానికి దూరంగా ఎన్ని రోజులైనా పనిచేయాల్సిందేనని బాధగా చెప్పారు. డిప్యూటేషన్‌పై పంపేముందు తమ అభిప్రాయాలను తెలుసుకోరని, ఇబ్బందులను కూడా వినరని తెలిపారు. ఒకవేళ కుటుంబ ఇబ్బందుల కారణంగా వెళ్ళకపోతే ఈ పనిని వదులుకోవాల్సిందేనన్నారు. ఎక్కువ మందికి ఏ విభాగంలో హోంగార్డుగా జాయిన్ అయితే ఇక ఎప్పటికీ అక్కడే పనిచేయాల్సి ఉంటుందని, ట్రాన్స్‌ఫర్లు ఉండవన్నారు. అంతా అధికారుల ఇష్టారాజ్యమేనన్నారు. అధికారులకు విధేయుడిగా ఉంటే ఒక రకంగా, లేకుంటే మరో రకమైన పరిస్థితి ఉంటుందన్నారు.

’డబుల్’ ఇల్లు ఇస్తే బాగుండు

ఎంత కాలం నుంచి పనిచేస్తున్నా సరైన సమయానికి వేతనాలు రావని, కిరాయి కట్టే విషయంలో ఒక్కో నెల ఒక్కో తేదీతో ఇబ్బంది పడుతున్నామన్నారు. అరకొరగా వచ్చే జీతాలు అద్దెకు, కుటుంబ అవసరాలక సరిపోతున్నాయని, అదనంగా ఏ ఒక్క ఖర్చు వచ్చినా మళ్ళీ అప్పులేనని వాపోయారు. ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్‌లు కట్టించి ఇస్తే కనీసం అద్దె భారమైనా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ విభాగంలో ఉన్న హోం గార్డులకైతే పొల్యూషన్ అలవెన్సుతో కలిపి ఇప్పుడు రూ.30 వేలు అందుతున్నాయన్నారు. ఒకవేళ పీఆర్సీని కలిపితే దాదాపు రూ.39 వేలు వచ్చే అవకాశం ఉందన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..