బాబుగారూ.. మీ ఆస్తులివేనా? కంపెనీ షేర్లెలా వచ్చాయి?

by  |
బాబుగారూ.. మీ ఆస్తులివేనా? కంపెనీ షేర్లెలా వచ్చాయి?
X

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆస్తిపాస్తుల వివరాలు ప్రకటించారు. రాజకీయాల్లో నైతిక విలువలు పెంచేందుకు 2011 నుంచి చంద్రబాబు కుటుంబం తమ ఆస్తుల వివరాలను బహిర్గతం చేస్తూ వస్తోంది. చంద్రబాబునాయుడు 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఈ బాధ్యతను ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ భుజానవేసుకున్నారు. గత కొంత కాలంగా ఆయనే కుటుంబ ఆస్తుల వివరాలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం…

చంద్రబాబు కుటుంబ ఆస్తి విలువ 88.67 కోట్ల నుంచి 102.49 కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే గతేడాది కంటే ఈ ఏడాది ఆయన ఆస్తి 13.82 కోట్లు పెరిగింది. చంద్రబాబు నాయుడుకి అంబాసిడర్ కారుంది. 1993లో 1.52 లక్షల రూపాయలకు దానిని కొనుగోలు చేశారు. ఆయన పేరిట ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాలో 74.10 లక్షల రూపాయల నగదుంది. జూబ్లిహిల్స్‌లో రోడ్ నెంబర్ 65లో బాబు, లోకేశ్ సంయుక్తంగా నిర్మించిన 1125 గజాల ఇంటి విలువ 8,01,36,000 రూపాయలు. కాగా, మొత్తం ఆస్తి 9 కోట్లు, అప్పులు 5.13 కోట్లు, నికర ఆస్తి 3.87 కోట్లు మాత్రమే.

ఇక ఆయన భార్య భువనేశ్వరి ఆస్తి వివరాల్లోకి వెళ్తే.. విలువైన రాళ్లు పొదిగిన 3,519 గ్రాముల బంగారు ఆభరణాలుండగా, వాటి విలువ 1,27,16,000 రూపాయలు మాత్రమే. బంగారంతో పాటు 42.41 కేజీల వెండి కూడా ఆమె వద్ద ఉంది. దాని విలువ 8.97 లక్షల రూపాయలు. హెరిటేజ్ ఫుడ్స్‌లో ఆమెకు 1,06,61,652 షేర్లున్నాయి. ఆమె పీఎఫ్ ఖాతాలో 40 లక్షల రూపాయలుండగా, బ్యాంక్ బ్యాలెన్స్ 1.30 లక్షలు పెరిగినట్టు చూపించారు. ఆమె మొత్తం ఆస్తుల విలువ 50.62 కోట్ల రూపాయలు కాగా, అప్పులు 11.04 కోట్ల రూపాయలు, నికర ఆస్తులు 9.58 కోట్ల రూపాయలుగా చెప్పారు.

ఇక నారా లోకేశ్ ఆస్తుల వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్డ్ నెంబర్ 65లో 1285 గజాల్లో తండ్రితో కలిసి నిర్మించిన ఇంటి విలువ 10.35 కోట్ల రూపాయలు. ఇక వారి కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్‌లో ఆయనకు 47,32,800 షేర్లున్నాయి. వాటి విలువ 2.52 కోట్ల రూపాయలు. ఆయన పేరిట ఒక ఫోర్డు ఫియెస్టా, 2 బుల్లెట్ ప్రూఫ్ ఫార్చూనర్ కార్లున్నాయి. వాటి విలువ 92.49 లక్షల రూపాయలు. ఇక మదీనాగూడలో అమ్మమ్మ నుంచి ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. దాని విలువ ప్రకటించలేదు. కాగా, లోకేశ్ మొత్తం ఆస్తుల విలువ 24.70 కోట్ల రూపాయలు కాగా, అప్పులు 5.70 కోట్లు. నికర ఆస్తులు 19 కోట్ల రూపాయలు.

లోకేశ్ సతీమణి ఆస్తుల వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్, జూబ్లీహిల్స్, మణికొండ జాగీరు గ్రామాల్లో స్థలాలున్నాయి. హెరిటేజ్ ఫుడ్స్‌లో ఆమెకు 2,02,000 షేర్లున్నాయి. వాటి విలువ 78.51 లక్షల రూపాయలు ఉంటుంది. నిర్వాణ హోల్డింగ్స్‌లో ఆమెకు 1.62 కోట్ల రూపాయల విలువైన షేర్లున్నాయి. ఈ షేర్లు ఆమెకు లోకేశ్ నుంచి బహుమతిగా సంక్రమించాయి. అలాగే ఆమెకు 310.06 క్యారెట్ల విలువైన రాళ్లతో పాటు 2,591.34 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ 15.95 లక్షల రూపాయలు. ఆమె మొత్తం ఆస్తుల విలువ 15.68 కోట్ల రూపాయలు కాగా, అప్పులు 4.17 కోట్ల రూపాయలు, నికర ఆస్తులు 11.51 కోట్ల రూపాయలు.

చంద్రబాబు, బాలయ్యల మనవడు దేవాన్ష్ ఆస్తుల వివరాల్లోకి వెళ్తే.. హెరిటేజ్ ఫుడ్స్‌లోని 26,440 షేర్లను తాత బాలకృష్ణ దేవాన్ష్‌కు బహుమతిగా ఇచ్చారు. వాటి విలువ ప్రకటించలేదు. లోకేష్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు 2.49 కోట్ల రూపాయల నుంచి 3.18 కోట్ల రూపాయలకు పెరిగాయి. వెండి ఉయ్యాల విలువ 2.87 లక్షల రూపాయలు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో దేవాన్ష్‌కు 1325.56 చదరపు గజాల స్థలం ఉంది. అక్కడ నిర్మాణం జరుగుతోంది. దాని విలువ 16.17 కోట్ల రూపాయలు. దేవాన్ష్ నికర ఆస్తి 19.42 కోట్ల రూపాయలు.

హెరిటేజ్ ఫుడ్స్‌లో నిర్వాణ హోల్డింగ్స్ కంపెనీకి 51,45,684 షేర్లున్నాయి. వీటి విలువ 10.82 కోట్ల రూపాయలు. అలాగే నిర్వాణకు గ్రూప్ సంస్థల్లో కొన్ని పెట్టుబడులున్నాయి. అవన్నీ స్టాక్ మార్కెట్‌లో అన్ లిస్టెడ్ కంపెనీలు. అలాగే ఆ సంస్థకు మూడు ఫార్చూనర్లు, ఒక రేంజ్ రోవర్, ఒక స్కార్పియో, బుల్లెట్ ఫ్రూఫ్ లాండ్ క్రూయిజర్, ఒక రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఒక బుల్లెట్ ప్రూఫ్ టాటా సఫారీ, మరోక టాటా సఫారీ వాహనాలున్నాయి. నిర్వాణ హోల్డింగ్స్ మొత్తం ఆస్తులు 43. 96 కోట్ల రూపాయలు కాగా, అప్పులు 34.85 కోట్లు. నికర ఆస్తుల విలువ 9.11 కోట్ల రూపాయలు.

లోకేశ్ ప్రకటించిన ఆస్తులపై విమర్శలు కూడా ప్రారంభమయ్యాయి. గతేడాది ఆయన ప్రకటించిన ఆస్తులతో ఇప్పుడు ప్రకటించిన ఆస్తులను టాలీ (సరిపోల్చుతూ) చేసి చూస్తూ వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 2019లో సీఎం పదవి నుంచి దిగిపోగానే అప్పటి వరకు తన పేరు మీద లేని కోట్ల రూపాయల విలువైన షేర్లను చంద్రబాబునాయుడు తన మనవడు దేవాన్ష్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడని అంటున్నారు. బాబు గత తొమ్మిదేళ్లలో ఏనాడూ తన పేరిట హెరిటేజ్‌ కాదు కదా ఏ కంపెనీ షేర్లు ఉన్నట్లు చూపించలేదని గుర్తు చేస్తున్నారు. కానీ అకస్మాత్తుగా 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తుల ప్రకటనలో చంద్రబాబు తన మనవడికి 26,640 హెరిటేజ్‌ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చారని చెప్పడాన్ని ప్రశ్నిస్తున్నారు.

2017–18లో దేవాన్ష్ పేరు మీద షేర్లు లేకపోగా ఇప్పుడు ప్రకటించిన జాబితాలో గ్రాండ్‌ పేరెంట్స్‌ 26,640 షేర్లను బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంటే దేవాన్ష్ నాయనమ్మ భువనేశ్వరికి చెందిన హెరిటేజ్‌ షేర్లల్లో కోత పడాలి… కానీ ఆమె షేర్లలో మార్పులేకపోవడం విశేషం. ఈ లెక్కన చూస్తే.. ఆ షేర్లను చంద్రబాబు ఇచ్చారా? అలా అయితే చంద్రబాబు ఇన్నాళ్లూ తనపేరిట ఆస్తులు లేవని చెప్పడం డ్రామా కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. వేసవిలో గత ప్రభుత్వం ప్రకటించిన మజ్జిగ పథకాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఒక సీఎంగా ఉంటూ తాను షేర్లు కలిగిన కంపెనీకి ప్రభుత్వం నుంచి ఆర్డర్లు ఇవ్వడం ఖచ్చితంగా క్విడ్‌ ప్రోకో కిందకి రాదా? అని వారు నిలదీస్తున్నారు.

హెరిటేజ్‌ ఫుడ్స్‌ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న నారా భువనేశ్వరి కోట్ల రూపాయల్లో జీతం తీసుకుంటున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ భారీ లాభాలు ప్రకటిస్తుండటంతో ఆమెకు డివిడెండ్‌ కూడా బాగానే ఇస్తోంది. ఈ లెక్కన గతేడాది హెరిటేజ్ ఫుడ్స్ షేరుకు 40 రూపాయల డివిడెంట్ ప్రకటించింది. ఈ లెక్కన ఆమెకు సుమారు 42 కోట్ల రూపాయలు డివిడెండ్‌గా రావాల్సి ఉండగా.. ఆస్తుల చిట్టాలో మాత్రం ఆమె ఆస్తుల్లో 2.75 కోట్లు తగ్గినట్లు చూపించారు. ఇదేలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. ఆస్తులు తగ్గడం పెరగడం అయితే చూపించారు కానీ.. ఎందుకు తగ్గాయి? అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే నారా లోకేష్ ఆస్తులను ప్రకటిస్తున్నప్పుడే.. వాటి విలువ ఇప్పటి మార్కెట్ రేట్ ప్రకారం కాదని, వాటిని కొన్నప్పుడు ఉన్న ధర ప్రకారమే తాము వాటి వివరాలు వెల్లడిస్తున్నామంటూ వైఎస్సార్సీపీ విమర్శలకు సమాధానం చెప్పడం కొసమెరుపు.



Next Story

Most Viewed