ప్రకృతితోనే ఫుల్ టైమ్ జాబ్

by  |
ప్రకృతితోనే ఫుల్ టైమ్ జాబ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకృతి మీద అతిగా ప్రేమ చూపించే వాళ్లను కొందరు వ్యక్తులు పిచ్చివాళ్లుగా పరిగణిస్తారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో నివసించే చందన్ నాయల్‌ను కూడా అలాగే చూశారు. అతని సొంత ఊరు పేరు నాయి గ్రామం. కేవలం ప్రకృతి మీద ప్రేమతో 2016లో తాను చేస్తున్న లెక్చరర్ ఉద్యోగం వదిలేసి, ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటుతూ అడవులను సంరక్షిస్తున్నాడు. ఇప్పటివరకు 12వేలకు పైగా మొక్కలను నాటిన చందన్.. వాటి నీటి సంరక్షణకు సంబంధించిన పనులను కూడా శ్రద్ధగా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎంతమంది తనను పిచ్చివాడు అని పిలిచినా, ప్రకృతిని కాపాడితే ఏం వస్తుందని హితబోధలు చేసినా కూడా ప్రకృతిని కాపాడటంలోనే తనకు నిజమైన సంతృప్తి దొరుకుతోందని అంటున్నాడు. మరి చందన్‌కు ప్రకృతి అంటే ఎందుకంత ప్రేమ?

ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న చందన్ తన చిన్నతనం నుంచి చుట్టూ ఉన్న అడవులు నాశనం అవుతుండటాన్ని కళ్లారా చూశాడు. కార్చిచ్చులు, అధిక వినియోగం, అక్రమ కలప రవాణా వంటి కారణాల వల్ల అడవుల్లో చెట్ల శాతం తీవ్రంగా తగ్గిపోవడాన్ని ప్రత్యక్షంగా చూశాడు. టీనేజీలో ఉన్నప్పటి నుంచే మొక్కలను నాటడం, చెట్లను సంరక్షించడం లాంటి కార్యకలాపాలు చేస్తుండేవాడు. అయితే క్రమంగా వనరులు తగ్గిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. 2010లో ఒకనాడు తన తల్లి అనారోగ్యంతో చనిపోతే, ఆ బాధను దిగమింగడానికి, ప్రశాంతత కోసం అడవిలోకి వెళ్లాడు. బంధువులు ఓదార్చిన దాని కంటే ఎక్కువ ప్రశాంతత అతనికి అడవిలోనే దొరికింది. దీంతో చెట్లను ఎక్కువ సంఖ్యలో నాటి, ఇప్పుడున్న అడవులకు తన చిన్నతనం నాటి వైభవాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. తన గ్రామానికి 170 కి.మీ.ల దూరంలో ఉద్యోగం చేస్తూ కూడా ఖాళీ దొరికినప్పుడల్లా వచ్చి మొక్కల సంరక్షణ చూసుకునేవాడు.

కానీ ఇలా మొక్కలను కొంత సమయం మాత్రమే చూసుకోవడం, వాటితో ఎక్కువ సమయం గడపలేకపోవడం చందన్‌కు నచ్చలేదు. అందుకే తాను చేస్తున్న లెక్చరర్ జాబ్‌ను వదిలేసి ఫుల్ టైమ్ ప్రకృతితోనే మమేకమై ఉండాలని సొంతూరుకు తిరిగొచ్చేశాడు. ఇక్కడ తనకు ఉన్న 10 గుంటల భూమికి వస్తున్న కౌలుతో బతుకుతున్నాడు. అయితే చందన్ నిర్ణయాన్ని అప్పుడు అందరూ తప్పుబట్టారు. అతని వయస్సు వాళ్లందరూ ఢిల్లీకి వెళ్లి ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదిస్తుంటే, చందన్ ఇక్కడ పిచ్చోడిలాగ చెట్లు, మొక్కలు అంటూ తిరుగుతున్నాడని తిట్టారు. కానీ లాక్‌డౌన్ తర్వాత ఢిల్లీకి వెళ్లిన వాళ్లందరూ తట్టాబుట్టా సర్దుకుని సొంతూరుకి వచ్చి, వ్యవసాయం చేసుకోవడం ప్రారంభించాక చందన్ చేసిన పనిని వారు అర్థం చేసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా చందన్‌ను ఆదర్శంగా తీసుకుని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువత కూడా మొక్కలు నాటడానికి ముందుకువస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సాయంతో ఆ చుట్టుపక్కల అడవుల్లో ఇప్పటివరకు 40 వేల మొక్కలు నాటినట్లు చందన్ తెలిపారు.

Next Story

Most Viewed