మన ఎంపీలు వరస్టంట!.. కేంద్రం నివేదిక చెబుతోంది

by  |
మన ఎంపీలు వరస్టంట!.. కేంద్రం నివేదిక చెబుతోంది
X

ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంలో మన ఎంపీలు వరస్ట్. సంక్షేమంలో, అభివృద్ధిలో ఆదర్శం అని పార్లమెంటులో గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఆచరణలో శూన్యం. ఎంపీ లాడ్స్ ద్వారా ఏటా ఐదు కోట్ల రూపాయలు సమకూరుతున్నా వాటితో పనులు చేయించడంలో మాత్రం ఘోర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కేంద్రం ఒక్క పైసా ఇవ్వడం లేదంటూ రాష్ట్రంలో అధికారపార్టీ ఎంపీలు గంభీరమైన ఉపన్యాసాలు దంచుతారు. కానీ వ్యక్తిగతంగా వారికి లభించే నిధులను మాత్రం ఖర్చు చేయరు. బండ ప్రకాష్ అనే టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ రెండేళ్ళ కాలంలో కేవలం ఐదు లక్షల రూపాయల పనులు మాత్రమే చేయించారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక కేసీఆర్‌కు కుడి భుజంగా ఉండే జోగినపల్లి సంతోష్ ఈ రెండేళ్ళలో కేవలం రూ.65 లక్షల పనులు మాత్రమే చేయించగలిగారు. ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నట్లు ఎంపీలాడ్స్ నివేదిక వివరించింది.

దిశ, న్యూస్ బ్యూరో : ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికార, ప్రతిపక్ష అనే తేడా లేకుండా అందరూ ఒకటే. నామా నాగేశ్వరరావు, పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాసరెడ్డి, మాలోతు కవిత, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ లాంటి కొంతమంది ఎంపీలు అసలు నిధుల కోసం ప్రయత్నమూ చేయలేదు. ప్రతిపాదనలు కూడా పంపలేదు. టిమ్స్ ఆసుపత్రి సీవరేజ్ ప్లాంట్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌కు లేఖ ఇచ్చారు. కానీ అది నివేదికలో ప్రతిబింబించలేదు.

తొమ్మిది మంది ఎంపీలు పైసా విదల్చలేదు

రాష్ట్రంలోని మొత్తం 17 మంది లోక్‌సభ ఎంపీల్లో తొమ్మిది మంది ఒక్క పైసా కూడా వినియోగించలేదని తేలింది. రాజ్యసభ సభ్యుల్లో మాత్రం ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఒక మేరకు నిధుల్ని వినియోగించుకున్నారు. అంతకు ముందు గరికపాటి మోహనరావు, కేవీపీ రామచంద్రరావు సైతం గరిష్ఠ స్థాయిలో నిధుల్ని వినియోగించారు. మంజూరైన నిధులు మూలుగుతున్నాయి తప్ప కరోనా కష్టకాలంలో వాటిని వినియోగించుకోడానికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం. అనేక రాష్ట్రాల ఎంపీలు ఈ నిధులను వాడుకుంటున్నా తెలంగాణలో మాత్రం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులంతా నిధుల కోసం వెంపర్లాడుతుంటే తెలంగాణ ఎంపీల్లో మాత్రం ఏటా వచ్చే రూ.5 కోట్లను కూడా ఖర్చు చేసుకోవాలన్న సోయి కనిపించడం లేదు. గ్రామాల్లో అభివృద్ధి పనులు, తాగునీటి పనులు, రోడ్ల కోసం ఈ నిధులు వినియోగించుకునే అవకాశాలున్నా ఆ దిశగా కృషి శూన్యం. పల్లెల్లో సమస్యలున్నాయంటూ ప్రజలు వినతిపత్రాలతో తిరుగుతున్నా పట్టింపు లేదు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలున్నపార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గతేడాది 17 మంది లోక్‌సభ ఎంపీలకు రూ.85 కోట్లు కేటాయింపులున్నా ఖర్చయింది మాత్రం కేవలం రూ.4.38 కోట్లే.

ఇరు సభల పెద్దలూ అంతే

రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు నిధుల కోసం కార్యాలయాలు, ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతుంటే ఎంపీలు మాత్రం చేతుల్లో నిధులున్నా వాడుకోవడం లేదు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఏటా కేంద్రం రూ.5 కోట్ల నిధులను తమ తమ సెగ్మెంట్లలో అభివృద్ధి పనులకు ఖర్చు చేసుకునే సౌలభ్యం ఉంది. కానీ లోక్‌సభ సభ్యుల సగటు వినియోగం కేవలం 10.31 శాతమే. రాజ్యసభ సభ్యుల సగటు వినియోగం 54 శాతం. బీజేపీకి చెందిన బండి సంజయ్, కిషన్‌రెడ్డి సైతం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. అసదుద్దీన్ ఒవైసీ సైతం కేవలం రూ.21 లక్షలే ఖర్చు పెట్టారు. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి కచ్చితమైన పనులు, వాటి ప్రస్తుత పురోగతి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed