మిగులు విద్యుత్‌ వివరాలివ్వండి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

by  |
power companies
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో బొగ్గు నిల్వలు తగ్గాయని విద్యుత్ సమస్య తలెత్తే అవకాశం ఉందని.. రాష్ట్రాల్లోని మిగులు విద్యుత్ వివరాలు ఇవ్వాలని కేంద్రం కోరింది. ఈ మేరకు సోమవారం రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్ శాఖ లేఖ రాసింది. బొగ్గు నిల్వలు తగ్గడంతో మిగులు విద్యుత్‌ను రాష్ట్రాలు అధిక ధరలకు అమ్ముకుంటున్నాయని, ఎవరికీ కేటాయించని కేటగిరీలోని విద్యుత్‌ను వినియోగదారులకు మాత్రమే సరఫరా చేయాలని కోరింది. అధిక ధరలకు ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

రాష్ట్రాలు మిగులు విద్యుత్ వివరాలు చెప్పాలని, ఆ మిగులు విద్యుత్‌ను అవసరం ఉన్న రాష్ట్రాలకు కేటాయిస్తామని పేర్కొంది. కొన్ని రాష్ట్రాలు వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయడం లేదని, పలు ప్రాంతాల్లో లోడ్ షెడ్డింగ్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి డిమాండ్ పెరిగిందన్నారు. పవర్ ఎక్సేంజ్‌లో విద్యుత్‌ను అమ్ముతున్నట్లు కానీ, కేటాయించని కేటగిరీ విద్యుత్‌ను వాడుకోలేకపోయినట్లయితే ఆయా రాష్ట్రాలకు ఆ కేటగిరీ కింద కరెంట్ కేటాయింపును తాత్కాలికంగా తగ్గించడం లేదా ఉపసంహరించడం జరుగుతుందన్నారు. మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో కేటాయింపు నిబంధనల ప్రకారం ఎవరికీ కేటాయించని కేటగిరీలో 15 శాతం విద్యుత్ ఉంటుందని ఆ వివరాలు అందజేయాలని రాష్ట్రాలకు సూచించింది.


Next Story

Most Viewed