పుట్టా విచారణలో బలమైన సాక్ష్యం దొరకడం లేదా..?

by  |
పుట్టా విచారణలో బలమైన సాక్ష్యం దొరకడం లేదా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మూడు రోజులుగా పోలీసు కస్టడీలో ఉన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధును విచారిస్తున్న పోలీసులకు బలమైన సాక్ష్యం దొరకడం లేదని తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలను కూడా సేకరిస్తున్న పోలీసులకు సాంకేతికంగా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం లభ్యం కానట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. రామగుండం కమిషనరేట్‌లో పుట్ట మధును విచారిస్తున్న పోలీసు అధికారులు అతనిపై హై కోర్టు అడ్వకేట్ గట్టు వామన్ రావు మర్డర్ కేసు అభియోగం మోపేందుకు కీలకమైన ఆధారాలు దొరకడం లేదని చర్చించుకుంటున్నట్టు సమాచారం. అయితే పోలీసులు పుట్ట మధుతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ద్వారా జరిగిన లావాదేవీల వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

రూ.2 కోట్ల సుపారీ మర్డర్ అని ఇందులో పోలీసుల ఇన్ వాల్వ్ మెంట్ కూడా ఉందని వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు ఏప్రిల్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో తిరిగి విచారణ ప్రారంభించిన పోలీసులు పుట్ట మధును విచారిస్తున్నారు. మరో వైపు ఆయన భార్య పుట్ట శైలజతో పాటు మరికొందరిని విచారిస్తున్నారు. పుట్ట మధు అకౌంట్ల వివరాలపై క్లారిటీ వస్తే మాత్రం కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సాంకేతికంగా పుట్ట మధు మోబైల్ కాల్ రికార్డ్ డాటా, నిందితుల మోబైల్స్ కాల్ డాటా వివరాలను కూడా సేకరిస్తున్నప్పటికీ ఆడియో రికార్డ్ మాత్రం లభ్యం కావడం లేదని తెలుస్తోంది.

హైకోర్టు జోక్యంతోనే: గంగుల కమలాకర్
పుట్ట మధుపై జరుగుతున్న విచారణకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ… వామన్ రావు మర్డర్ కేసు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకున్నందునే పుట్ట మధును పోలీసులు విచారిస్తున్నారని అన్నారు.



Next Story