కేటీఆర్ కాగలడా.. మరో కేసీఆర్..!

by  |
కేటీఆర్ కాగలడా.. మరో కేసీఆర్..!
X

దిశ, డెస్క్: రాష్ట్ర రాజకీయం మారిపోతోంది.. అన్ని పార్టీలూ 2023 ఎన్నికలే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో సైతం భారీగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన తనయుడు తారక రామారావుకు ఏకంగా తన సింహాసనాన్ని అప్పగించి పట్టాభిషేకం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఇటీవల ‘కేటీఆర్ కాబోయే సీఎం..’ అంటూ జనాల్లో ఓ హైప్ క్రియేట్ చేశారు. మరి యువనేత సింహాసనాన్ని అధిష్టించబోతున్నాడంటే మాటలా..?! ఆ రాజ్యం ఎలా ఉండబోతోందో అని ఓ వర్గం ఆసక్తిగా ఊహల్లో విహరిస్తుంటే.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే.. అంటూ మరో వర్గం కొత్త వాదానికి తెర తీస్తూ కేసీఆర్ గుణగణాలతో పోల్చి చూస్తోంది.

మాటల మరాఠీ, ముక్కుసూటి వ్యక్తిగా పేరున్న కేసీఆర్ కు దీటుగా ఆయన కొడుకు పాలన సాగిస్తాడా? అని సందేహిస్తున్నారు కొందరు నేతలు. అంతేకాదు.. తన తండ్రిలో ఉన్న చాణక్య చాతుర్యం, రాజకీయ వ్యూహం, అనర్గళ వాగ్ధాటి, తన వాదాన్ని సాధించుకునే సత్తా.. ఇవ్వన్నీ కేటీఆర్ లో ఏమాత్రం ఉన్నాయంటూ లెక్కలేసుకుంటున్నారు. ప్రత్యర్థుల దాడిని తిప్పికొట్టి వ్యూహాలతో ముప్పతిప్పలు పెట్టే తన తండ్రి గుణం ఎంత వరకు పుణికి పుచ్చుకున్నాడనే చర్చ జరుగుతోంది. అంతేనా.. ఇప్పుడు జై కొడుతున్న నేతలు ఎంత వరకు యువనేతతో కలిసి నడుస్తారో తెలియదు. భవిష్యత్ లో ఎంతమంది ధిక్కార స్వరం వినిపిస్తారో ఊహించలేరంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ల పరిస్థితి వేరు.. రాష్ట్రంలో ఇప్పుడున్న ‘స్థితి’ వేరు. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపడితే కేటీఆర్ మరో కేసీఆర్ లా రాష్ట్రాన్ని ఏ మేరకు నడిపిస్తారో చూడాలంటున్నారు మేధావులు.

సీనియర్ల సహకారం ఎంత వరకు..?

కేటీఆర్ యువనేతే.. ఆయనంటే యూత్ లో కొంత క్రేజ్ ఉందనేది కాదనలేం.. కానీ ఇవే పార్టీని, ప్రభుత్వాన్ని నిలబడేట్టు చేయలేవు. ఎందుకంటే ఇప్పుడు జై కొడుతున్న నేతలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్లే అలా మాట్లాడుతున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అంతేకాదు.. కేసీఆర్ మాటే శాసనంగా ఉన్న రోజుల్లో కొంత మంది సీనియర్లు ఆయన మాటను జవదాటిన సందర్భాలూ ఉన్నాయి. అదీకాక పలు సందర్భాల్లో పరోక్ష వ్యాఖ్యలు, చేసిన విమర్శలను గుర్తు చేస్తున్నారు. ‘టీఆర్ఎస్ పార్టీకి, గులాబీ జెండాకు మేమే అసలైన ఓనర్లం’ అంటూ ఓ నేత తన అసంతృప్తి వెళ్లగక్కిన రోజులనూ గుర్తు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంకొందరైతే ‘ఇలాంటి రాజకీయాల్లో ఉన్నందుకు సిగ్గు పడుతున్నా..’ అని వ్యాఖ్యానించారు. మరో సీనియర్ నేత అయితే ‘దమ్ముంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసి చూడు..’ అంటూ ఘాటుగానే ఓ సందర్భంలో స్పందించారు. మరి కేటీఆర్ కు అలాంటి వారు ఎంత వరకు సహకరిస్తారనేది సందేహం అంటున్నాయి పార్టీ వర్గాలు.

అనుభవం పోల్చి చూస్తే..

టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కేసీఆర్ ఎన్నో అడ్డంకులు, అవమానాలు, అవహేళనులు, ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నారు. పట్టు వదలకుండా సుదీర్ఘ పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించారు. కేవలం స్వరాష్ట్ర సాధన కోసమే ఉద్భవించిన ఉద్యమపార్టీని రాజకీయ పార్టీగా మార్చేందుకు కేసీఆర్ వేయని ఎత్తుగడ, చూపించని చతురత లేదంటారు ఆయన అత్యంత సన్నిహితులు. అంతటి అనుభవం సాధించగలిగారు కాబట్టే ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ఈ రోజు సీఎంగా కొనసాగుతున్నారని చెపుతున్నారు. మరి కేసీఆర్ తో పోల్చుకుంటే కేటీఆర్ అనుభవం ఏమాత్రమంటున్నారు మేధావులు. ఉద్యమాన్ని నడిపించడంలో కేసీఆర్ చూపిన తెగువ.. స్వరాష్ట్ర సాధన అనంతరం పార్టీ కనుమరుగు కాకుండా వేసిన ఎత్తుగడను అసమానమైనవిగా వర్ణిస్తుంటారు. అలాంటి రాజనీతిజ్ఞత ఆ స్థాయిలో కేటీఆర్లో ఎప్పుడూ కానరాలేదని పెద్దలు చర్చించుకుంటున్నారు.

విమర్శలు తిప్పికొట్టే సమర్థతెంత..?

‘కేటీఆర్ ఓ బచ్చా..’ ‘రాజకీయాల్లో కేటీఆర్ ఓ చిలక..’ ‘మా ముందు నువ్వో బచ్చావి..’ ఇవి సాధారణంగా కేటీఆర్ ను ఉద్దేశించి ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రతిసారీ చేసే విమర్శలు. మరి ఇలాంటి విమర్శలు విన్నప్పుడు కేటీఆర్ ధైర్యంగా, సంయమనంతో సమాధానమిచ్చిన సందర్భాలు చాలా తక్కువే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆవేశ పూరితంగానే ప్రతి విమర్శలు చేసిన సందర్భాలే ఎక్కువని చెబుతున్నారు. అదే కేసీఆర్ అయితే తప్పదనుకుంటే తప్ప ఎప్పుడూ ఎదుటి వారి విమర్శలను పెద్దగా పట్టించుకునే వాడు కాదని.. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ప్రస్థావించేవాడని ఆయన సన్నిహితులు అంటుంటారు. అంతేకాదు ప్రత్యర్థులను తనకున్న విషయ పరిజ్ఞానంతో కన్ఫూజ్ చేయడంలో దిట్టగా కేసీఆర్కు పేరుంది. ఇక కేటీఆర్ లోతైన అవగాహన కల్గిన నేతలకు సమాధానం ఇవ్వడంలో తానే డైలమాలో పడుతుంటాడడని యువనేతను గమనించే వారు చెబుతున్నమాట.

ఇక బీజేపీ పని సులువేనా..?

2023లో రాష్ట్రంలో అధికారంలోకి ఎలాగైనా రావాలని బీజేపీ కలలు గంటోంది. దానికి తగ్గట్టే ఢిల్లీ పెద్దలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. దుబ్బాక గెలుపుతో ఉక్కిరిబిక్కిరయిన టీఆర్ఎస్ పెద్దలు.. గ్రేటర్ ఫలితాలతో ఏకంగా డైలమాలో పడ్డారు. ఆ తర్వాత జరిగిన పార్టీ అంతర్గత మీటింగ్ లో సీఎం కేసీఆరే.. ‘అసలేం జరుగుతోంది.. ప్రజలు ప్రభుత్వాన్ని, పార్టీని నమ్మట్లేదా..?’ అని పార్టీ నేతల మీద సీరియస్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. గ్రేటర్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడమే కాదు.. అంతేకంటే ఎక్కువ స్థాయిలో బీజేపీ పుంజుకుందనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రత్యర్థులను డైలమాలో పడేసి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడం సిద్ధహస్తుడిగా పేరున్న కేసీఆరే రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోలేకపోతున్నారు. అంతేకాదు కేంద్రానికి సరెండర్ అయినట్లుగా ప్రచారం జరగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ కు పగ్గాలు అప్పజెప్పడమంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరింత బలం పుంజుకునేందుకు అవకాశం కల్పించినట్టే అని పార్టీలోని కొందరు నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే టీఆర్ఎస్ హ్యాట్రిక్ విక్టరీ చరిత్రలో నిలిచిపోతుంది. అలాంటి తరుణంలో కేటీఆర్ కి పార్టీ పగ్గాలు అప్పగించడమంటే సాహసోపేతమైన నిర్ణయమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కేటీఆర్ వల్ల ఏమాత్రం అవుతుంది? బలాలు, బలహీనతలు కచ్చితంగా బేరీజు వేసుకుని అడుగులు వేయాలంటున్నారు.

జగన్ తో పోల్చితే చూడగలమా..?

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో పోల్చి చూస్తున్నారు కొందరు నేతలు. ఇద్దరూ యువనేతలే.. రాజకీయాల్లో దాదాపుగా ఇద్దరూ సమకాలికులే. కానీ ఇద్దరి అనుభవాలు వేరు. కేటీఆర్ ఉద్యమం పేరుతో కొంతకాలం జనాల్లో ఉన్నా.. జగన్ సుదీర్ఘంగా పూర్తిస్థాయిలో జనం మధ్యే ఉండి ప్రజలతో మమేకమయ్యాడని చెపుతుంటారు జగన్ అభిమానులు. అందుకే ఒంటి చేత్తో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఓ గొప్ప విజయాన్ని సాధించాడని చెబుతున్నారు. మరి అంతటి క్రేజ్ కేటీఆర్ కు ఉందా? అనే కోణంలో కూడా ఆలోచనలు బయటకు వస్తున్నాయి. ఇక జగన్ జైల్లో ఉన్నప్పుడు ఎంతో ఓపిక, ధైర్యం, పట్టుదలతో ముందడుగు వేసి లక్ష్య సాధనలో సుదీర్ఘ పోరాటమే చేశాడు. మరి అంతటి ఓర్పు ఉన్న నాయకుడు ఇప్పుడెవరూ లేరంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఇటీవల ఓ సర్వే బెస్ట్ సీఎంలో జగన్ మొదటి నుంచి మూడు స్థానంలో ఉన్నట్లు కూడా చెప్పింది. రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చిన కేసీఆరే వెనుకబడి ఉండడం గమనార్హం. అలాంటిది.. జనాల్లో జగన్ చరిష్మాను, కేటీఆర్ చరిష్మాను పోల్చి చూడగలమా..? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా రాజకీయాల్లో జగన్ కి ఎదురైన అనుభవాలు వేరు, కేటీఆర్ ఎదుర్కొన్న సవాళ్లు వేరు. ఇద్దరూ తండ్రుల బాటలోనే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. కానీ జగన్ ని ఎస్టాబ్లిష్ అయ్యేలోపే తండ్రి వైఎస్సార్ హఠాన్మరణం చెందారు. దీంతో రాజకీయాల్లో ఎదిగేందుకు జగన్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రజల్లోకి వెళ్లేందుకు చేపట్టిన ఓదార్పుయాత్రకి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కాంగ్రెస్ నుండి బయటకి వచ్చి… సొంత పార్టీ పెట్టడం, సోనియాని ఢీకొట్టడం యూత్ లో క్రేజ్ పెంచాయి. అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్లినప్పటికీ… రాజకీయంగా ఎదుర్కోలేకనే ఒక్కడిని చేసి ఇబ్బందులు పెడుతున్నారంటూ జరిగిన ప్రచారం మరింత సానుభూతిని తెచ్చిపెట్టింది. ఇక మహానేత తనయుడిగా ఆయన అడుగుజాడల్లోనే జగన్ నడుస్తున్నాడు అనే అభిప్రాయం చాలామందిలో బలంగా నాటుకుపోయింది. వెరసి పదేళ్ల పోరాటం తర్వాత ప్రజలు జగన్ కి సీఎంగా పట్టం కట్టారు.

అదే కేటీఆర్ విషయానికి వస్తే… ఆయన రాజకీయ ప్రయాణం చాలా సులువుగానే సాగింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత, టీఆరెస్ అఖండ విజయం కైవసం చేసుకుంది. కేసీఆర్ ని చూసే ఆ పార్టీకి ఓటేశారనడంలో అతిశయోక్తి లేదు. ఇక అదే ఎన్నికల్లో కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి పదవి దక్కించుకోవడం సునాయాసంగా జరిగిపోయింది. ఇక రెండోసారి కూడా అదే సీన్ రిపీట్. అయినప్పటికీ… యువమంత్రిగా ప్రజల అభిమానాన్ని చూరగొనేందుకు కేటీఆర్ చొరవ చూపిస్తూనే ఉన్నారు. తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోకుండా, తండ్రి ఏర్పరిచిన రాచమార్గపు మరకలు పోకపోవడంతో… జగన్ కి దక్కినంత క్రేజ్ కేటీఆర్ కి దక్కలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మాస్ ఫాలోయింగ్ కూడా ముఖ్యమే…

కేటీఆర్ అంటే యూత్ లో కొంత వరకు క్రేజే.. అయన గ్లామరస్ పర్సన్.. ఇంగ్లీష్ టాకింగ్ బాగుంటుంది.. ఐటీ సెక్టార్ లో కొన్ని సంస్కరణలు చేసిన మాటా వాస్తవమేనని.. రాష్ట్రంలో కొన్ని పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చేయడంలో కేటీఆర్ సఫలం అయ్యారని చెపుతున్నారు మేధావులు. కానీ ఇవే ఓ వ్యక్తిని డైనమిక్ లీడర్ ను చేయలేవంటున్నారు. గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేటీఆర్ చరిష్మాతో 99 సీట్లు సాధిస్తే.. బీజేపీ జోరుతో ఈ సారి చతికిలపడ్డ విషయాన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఓ నాయకుడు రాజకీయాల్లో ఎక్కువకాలం నిలవాలంటే మాస్ ఫాలోయింగ్ కూడా చాలా ముఖ్యం. అదే మాస్ ఫాలోయింగ్ కేసీఆర్ ను ఇప్పటి వరకు నిలబెట్టగలిగిందని, ఇంకా జగన్ ప్రభను కొనసాగిస్తున్నదని గుర్తు చేసుకుంటున్నారు. కేటీఆర్ మాస్ ఫాలోయింగ్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు పొలిటికల్ అభిమానులు.

భారీగా స్పందన వస్తుందనుకుంటే..

కేటీఆర్ కాబోయే సీఎం.. ఈ వ్యాఖ్యలు పార్టీ పెద్దల ఆదేశాల మేరకే మంత్రులు, ఎమ్మెల్యేలు చేశారనే వాదన వినిపిస్తోంది. అయితే జనాల్లో భారీగా స్పందన వస్తుందనుకుంటే వచ్చిన ఫీడ్ బ్యాక్ చూసి గులాబీ బాస్ ఖంగుతిన్నారనే ప్రచారమూ జరుగుతోంది. అంతేకాదు.. పార్టీలోని మెజార్టీ నేతలు కూడా యువనేతను సీఎం చేస్తున్నారంటే ముభావంగానే ఉన్నట్లు సమాచారం. అయితే ప్రజల్లో ఇప్పుడున్న స్పందన గమనించిన అధిష్టానం పెద్దలు డైలమాలో ఉన్నారని.. ఇప్పుడే ఎలాంటి నిర్ణయమూ తీసుకోవద్దనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. లేటయినా సరే తీసుకునే స్టెప్ పెర్ ఫెక్ట్ గా ఉండాలని అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed