హుజురాబాద్​ ఉప ఎన్నికకు కౌంట్​డౌన్ స్టార్ట్​.. నేతల్లో టెన్షన్ టెన్షన్

by  |
Huzurabad
X

దిశ, హుజురాబాద్​ : హుజురాబాద్​ ఉప ఎన్నిక ప్రక్రియ రోజు రోజుకూ దగ్గర పడుతోంది. ఎల్లుండితో బహిరంగ ప్రచారం ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. ఇప్పటికే ఆయా పార్టీల ముఖ్య నేతలు ప్రచారం పూర్తి చేశారు. అధికార పార్టీ నుంచి అమాత్యులు ఇంకా ఇక్కడే మకాం వేశారు. సంక్షేమ పథకాలు, ఈటల రాజేందర్​పై విమర్శలతో అధికార పార్టీ ప్రచారం చేస్తే.. తెలంగాణ ఉద్యమం, టీఆర్​ఎస్​ ద్రోహం, ఉద్యమ ద్రోహులకు అందలం వంటి అంశాలను ప్రధానాస్త్రంగా చేసుకుని బీజేపీ ప్రచారం చేసింది. ఈ నెల 20 వ తేదీ నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విజయశాంతి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షరాలు డీకే అరుణ, ఎంపీ అరవింద్ లు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇక ఈ రెండు పార్టీల వైఫల్యాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం అంశాలతో కాంగ్రెస్​ ప్రచారాన్ని హోరెత్తించింది. ప్రస్తుతం బహిరంగ ప్రచారం ఇంకో రెండు రోజులు మాత్రమే ఉండటంతో పార్టీలు ఓటర్లను వేడుకుంటున్నాయి.

ప్లీనరీలో ఇదే కీలకాంశం

దాదాపు రెండేండ్ల విరామం తర్వాత టీఆర్​ఎస్​ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఏడు తీర్మానాలతో ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించినా.. అసలు అంశం మాత్రం హుజురాబాద్​ ఉప ఎన్నికపైనే చర్చ జరుగనుంది. హుజురాబాద్​ కోసం పార్టీ నుంచి హామీలను సైతం ఇవ్వనున్నారు. ఇప్పటికే పార్టీ పదవులు, నామినేషన్​ పదవుల్లో హుజురాబాద్​ నేతలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్టీ పదవుల్లో కూడా వారికి అవకాశం ఇస్తామనే సంకేతాలను తీసుకెళ్లనున్నారు. ప్లీనరీ వేదికగా హుజురాబాద్​ ఉప ఎన్నిక ఆవశ్యకతను వివరించేందుకు టీఆర్​ఎస్​ బాస్​ప్లాన్​ చేసినట్లు తెలుస్తోంది.

మీరు రావద్దు

మరోవైపు హుజురాబాద్​ ఉప ఎన్నిక ప్రచారం నేపథ్యంలో హుజురాబాద్​ ప్రాంత నేతలను ప్లీనరీకి దూరంగా ఉంచారు. ఇక్కడి నేతలను రావద్దంటూ పార్టీ నుంచి ఆదేశించారు. దీంతో ప్లీనరీకి మంత్రులు హరీశ్​రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో పాటు హుజురాబాద్​ ప్రాంతానికి చెందిన ముఖ్య నేతలు గైర్హాజరయ్యే అవకాశం ఉంది.

స్థానికేతర నేతలు ఎలా..?

ఎల్లుండి నుంచి హుజురాబాద్​ సెగ్మెంట్‌ను స్థానికేతర నేతలంతా ఖాళీ చేయాల్సిందే. ఎన్నికల నిబంధనల ప్రకారం బహిరంగ ప్రచారానికి తెర పడుతోంది. అయితే ఇప్పటి వరకు ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి స్థానికేతర నేతలు మకాం వేశారు. కొన్నిచోట్ల బంధువుల ఇండ్లలో తిష్ట వేశారు. ప్రస్తుతం ఎల్లుండి నుంచి వీళ్లంతా వెళ్లిపోవాల్సి ఉంటోంది. అయితే కొన్నిచోట్ల బంధువులు, ఏదో శుభకార్యం అనే సాకుతో స్థానికేతర నేతలు సెగ్మెంట్​లోనే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లాకు చెందిన నేతలు ఇక్కడ ఎక్కువగా ఉండాలని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం ఎలా చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.



Next Story