Deepinder Goyal: స్వదేశీ జెట్ ఇంజిన్ల తయారీపై ఆసక్తి చూపిస్తున్న జొమాటో సీఈఓ

by S Gopi |

మేడ్-ఇన్-ఇండియా గ్యాస్ టర్బైన్ ఇంజిన్‌ను నిర్మించాలని కంపెనీ లక్ష్యంగా ఉంది.

Deepinder Goyal: స్వదేశీ జెట్ ఇంజిన్ల తయారీపై ఆసక్తి చూపిస్తున్న జొమాటో సీఈఓ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మద్దతిస్తున్న ఏవియేషన్ స్టార్టప్ ఎల్ఏటీ ఏరోస్పేస్ భారత్‌లో సొంత గ్యాస్ టర్బైన్ ఇంజిన్‌ను నిర్మించేందుకు సిద్ధమవుతోందని చెప్పారు. బెంగళూరులో ఒక ప్రొపల్షన్ రీసెర్చ్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో టర్బైన్లు, రోటర్లు, కంట్రోల్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేయడంలో అనుభవం ఉన్న వారికోసం అన్వేషిస్తున్నట్టు దీపిందర్ గోయల్ తన లింక్‌డ్ఇన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మేడ్-ఇన్-ఇండియా గ్యాస్ టర్బైన్ ఇంజిన్‌ను నిర్మించాలని కంపెనీ లక్ష్యంగా ఉంది. మన ఏరో స్పేస్ రంగంలో కీలక మార్పులకు తాను సిద్ధంగా ఉన్నట్టు దీపిందర్ గోయల్ అన్నారు. స్వదేశీ గ్యాస్ టర్బైన్ ఇంజిన్‌ల తయారీలో భారతీయ ఇంజనీర్లకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తామని, ఒకవేళ విఫలమైనప్పటికీ వారికి తిరిగి అవకాశాలు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. ఇంజనీర్లకు తగిన ప్రోత్సాహకాలు కూడా ఉంటాయని గోయల్ వెల్లడించారు.

గతంలో భారత్ స్వదేశీ గ్యాస్ టర్బైన్ ఇంజిన్ నిర్మించేందుకు ప్రయత్నించిందని, అయితే ఎల్ఏటీ మళ్లీ దానికోసం మునందుకొచ్చింది. ఏల్ఏటీ ఏరోస్పేస్ పరిశోధనా కేంద్రం దహన, టర్బోమెషినరీ, థర్మల్ సిస్టమ్‌లు,మెటీరియల్స్‌తో కూడిన ప్రయోగశాలలతో ఏర్పాటైంది. ఇక్కడ ఇంజనీర్లు అవసరమైన ఆవిష్కరణలకు వీలు కల్పిస్తుందని దీపిందర్ గోయల్ వివరించారు. కంపెనీ చేపట్టే పరిశోధనలకు ఏ వ్యాపార సంబంధిత వ్యక్తులూ నాయకత్వం వహించరని, ఇంజనీర్ల చేతుల్లోనే వీటి నిర్వహణ ఉంటుందని గోయల్ స్పష్టం చేశారు. కాగా, ఇదివరకు 1986లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) ప్రారంభించిన కావేరీ ఇంజిన్ ప్రోగ్రామ్, భారత లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) తేజస్ కోసం స్వదేశీ జెట్ ఇంజిన్‌ను అభివృద్ధికి పనిచేసింది. సాంకేతిక సవాళ్లు, ఆలస్యం వల్ల ఇది పూర్తవలేదు.

Next Story