Yes Bank: యెస్ బ్యాంకు ఫారెక్స్‌ కార్డుల్లో మోసపూరిత లావాదేవీలు

by S Gopi |

బుక్‌మైఫారెక్స్‌తో కలిసి యెస్ బ్యాంకు తీసుకొచ్చిన మల్టీ కరెన్సీ ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డులను ఉపయోగించి మోసపూరిత లావాదేవీలు జరిగాయని బ్యాంకు ఓ ప్రకటనలో వెల్లడించింది.

Yes Bank: యెస్ బ్యాంకు ఫారెక్స్‌ కార్డుల్లో మోసపూరిత లావాదేవీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో జరుగుతున్న తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవలే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో జరిగిన నిధుల గోల్‌మాల్ బహిర్గతమైన రోజుల వ్యవధిలోనే మరో బ్యాంకులో మోసం వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ రంగ యెస్ బ్యాంకులో గురువారం ఫారెక్స్ కార్డుల ద్వారా జరిగిన లావాదేవీల మోసాన్ని గుర్తించారు. బుక్‌మైఫారెక్స్‌తో కలిసి యెస్ బ్యాంకు తీసుకొచ్చిన మల్టీ కరెన్సీ ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డులను ఉపయోగించి మోసపూరిత లావాదేవీలు జరిగాయని బ్యాంకు ఓ ప్రకటనలో వెల్లడించింది. లాటిన్ అమెరికాలోని ఓ దేశంలో ఆన్‌లైన్ చెల్లింపులు చేయడానికి కొందరు తెలియని వ్యక్తులు కార్డు వివరాలను ఉపయోగించారని తెలుస్తోంది. దీనికోసం దాదాపు 5,000 మంది కస్టమర్ల కార్డు వివరాలను చోరీ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం డబ్బు దాదాపు 2,80,000 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 2.5 కోట్లు) లావాదేవీ జరిగిందని, ఈ మొత్తంలో ఏ ఒక్క లావాదేవీ కూడా కార్డు ఉన్న కస్టమర్లు స్వయంగా చేయలేదని బ్యాంకు వివరించింది. కస్టమర్లకు చెందిన సీవీవీలను దొంగలించి అనుమతుల్లేకుండా ఈ లావాదేవీలు చేశారని స్పష్టం చేసింది. ఈ విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కూడా బ్యాంకు నుంచి వివరణ కోసం సమన్లు జారీ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

మోసం ఎలా బయటపడింది

బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్ అనేక చెల్లింపులు పదే పదే డిక్లైన్ అవడాన్ని గమనించింది. దీనిపై తనిఖీ చేసిన తర్వాత, ఈ లావాదేవీల్లో చాలావరకు ఆన్‌లైన్ చెల్లింపులు అదనపు సెక్యూరిటీ చర్యలు అవసరం లేని ఓ దేశం నుంచి జరిగాయని బ్యాంక్ గుర్తించింది. ఫిబ్రవరి 24న ఉదయం 3.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య మర్చంట్ అకౌంట్ల నుంచి ఈ లావాదేవీలు జరిగాయి. ఆ దేశంలో ఈ-కామర్స్ లావాదేవీల కోసం 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేకపోవడం ఈ ఫ్రాడ్ జరిగేందుకు ఆస్కారం ఏర్పడింది.

బ్యాంకు ఏంచేసింది

దీన్ని గుర్తించిన వెంటనే యెస్ బ్యాంకు లాటిన్ అమెరికా దేశం నుంచి ఈ-కామర్స్ లావాదేవీలను నిలిపేసింది. అనుమానాస్పద లావాదేవీలను తక్షణం బ్లాక్ చేసింది. కొందరి కస్టమర్ల కార్డులను కూడా బ్లాక్ చేసింది. అయితే, మోసపూరిత లావాదేవీలు జరిగిన కస్టమర్లకు ఎటువంటి ఆర్థిక నష్టం ఉండదని బ్యాంకు స్పష్టం చేసింది. బ్లాక్ చేసిన కార్డులకు బదులుగా కొత్త వాటిని కస్టమర్లకు జారీ చేస్తామని పేర్కొంది.

బుక్‌మైఫారెక్స్ ఏమంటోంది

దీనిపై స్పందించిన బుక్‌మైఫారెక్స్ తమ నుంచి ఎటువంటి సమాచారం లీక్ లేదా చోరీ జరగలేదని ప్రకటించింది. ముఖ్యంగా తమ వద్ద సీవీవీ లాంటి సున్నితమైన డేటా లేదని వెల్లడించింది.

ఫారెక్స్ కార్డుల గురించి

మల్టీ కరెన్సీ ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులు అంటే విదేశాలకు వెళ్లే వారు ఉపయోగించే ప్రత్యేక కార్డు. ఇందులో ముందుగా డబ్బు లోడ్ చేసుకుని ఉపయోగించే ట్రావెల్ కార్డు. ఇందులో ఒకటి కాకుండా చాలా దేశాల కరెన్సీలు (ఉదాహరణకు డాలర్, యూరో, పౌండ్ వంటి) లోడ్ చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్లినప్పుడు, హోటల్ చెల్లింపులు, షాపింగ్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు, ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా కొసం డెబిట్ కార్డు తరహాలో ఉపయోగించవచ్చు.

Next Story