World Bank: ఇరాన్ యుద్ధం తర్వాత పొంచి ఉన్న ఉద్యోగ సంక్షోభం

by S Gopi |

ప్రస్తుత ఆర్థిక ధోరణులు కేవలం 40 కోట్ల ఉద్యోగాలను మాత్రమే సృష్టిస్తాయని, దీనివల్ల దాదాపు 80 కోట్ల ఉద్యోగాల కొరత ఏర్పడుతుందని తెలిపారు.

World Bank: ఇరాన్ యుద్ధం తర్వాత పొంచి ఉన్న ఉద్యోగ సంక్షోభం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక రంగాన్ని పశ్చిమాసియా యుద్ధం ఎక్కువ ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు చీఫ్ అజయ్ బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆయన తెలిపారు. దీర్ఘకాలంలో అంటే వచ్చే పదేళ్లలో కోట్లాది మందిని ఈ యుద్ధం నిరుద్యోగులుగా మార్చగలిగే ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. రాబోయే 10 నుంచి 15 ఏళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుమారు 120 కోట్ల మంది ప్రజలు పని చేసే వయస్సులోకి ప్రవేశించనున్నారు. ప్రస్తుత ఆర్థిక ధోరణులు కేవలం 40 కోట్ల ఉద్యోగాలను మాత్రమే సృష్టిస్తాయని, దీనివల్ల దాదాపు 80 కోట్ల ఉద్యోగాల కొరత ఏర్పడుతుందని తెలిపారు. ఇరాన్ యుద్ధం, ముడి చమురు ధరల పెరుగుదల వంటి తాత్కాలిక సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడం వల్ల, దేశానికి ముఖ్యమైన దీర్ఘకాల ఉద్యోగ సమస్యలు పట్టించుకోకుండా పోతున్నాయని అజయ్ బంగా అభిప్రాయపడ్డారు.

ప్రధాన ఆందోళనలు

ప్రభుత్వాలు తక్షణం ఎదుర్కొంటున్న సంక్షోభాలను, ఉద్యోగ కల్పన, స్వచ్ఛమైన నీటి లభ్యత, విద్యుదీకరణ వంటి దీర్ఘకాలిక ప్రాధాన్యతలతో సమతుల్యం చేసుకోవాలని వరల్డ్ బ్యాంక్ చీఫ్ సూచించారు. ఉద్యోగాలను కల్పించడంలో విఫలమైతే అది అక్రమ వలసలు, అస్థిరతకు ఆజ్యం పోస్తుందని ఆయన స్పష్టం చేశారు. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 11.7 కోట్ల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి అంచనాలు చెబుతున్నాయి. తక్షణ సమస్యలైన ద్రవ్యోల్బణం, మార్కెట్ల పతనం, నిధుల కొరతతో పాటు ఉద్యోగాల కొరత, మౌలిక సదుపాయాల కల్పనలో లోపాలు, ఇతర ప్రతికూలతల వంటి దీర్ఘకాల సమస్యలను పరిష్కరించడానికి, ప్రభుత్వం, బ్యాంకులు, ప్రైవేట్ ఇన్వెస్టర్లు కలిసి పని చేయడం చాలా అవసరమని అజయ్ బంగా వెల్లడించారు.

Next Story