Phonepe: ఫోన్‌పే ఐపీఓకు బ్రేక్

by S Gopi |

తాత్కాలికంగా ఐపీఓ ప్రక్రియను వాయిదా వేశామని కంపెనీ సీఈఓ సమీర్ నిగమ్ స్పష్టం చేశారు.

Phonepe: ఫోన్‌పే ఐపీఓకు బ్రేక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తన పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ప్రక్రియకు బ్రేకులు వేసింది. ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి కంపెనీకి అనుమతులు వచ్చాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలు, స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా ఐపీఓ ప్రక్రియను వాయిదా వేశామని కంపెనీ సీఈఓ సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. స్టాక్ మార్కెట్లలో స్థిరమైన ర్యాలీ వచ్చిన తర్వాత తిరిగి ఐపీఓ ప్రక్రియను కొనసాగిస్తామని, త్వరలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పుంజుకుంటుందని ఆశిస్తున్నట్టు సమీర్ చెప్పారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు త్వరగా శాంతించాలని ఆశిస్తున్నాం. యుద్ధ పరిస్థితుల వల్ల దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉందన్నారు. దేశీయంగా అతిపెద్ద డిజిటల్ పేమెంట్ యాప్‌గా ఉన్న ఫోన్‌పే 2025 నాటికి 65 కోట్ల యూజర్లు, 4.7 కోట్ల మర్చంట్లతో ఆధిపత్యం కలిగి ఉంది. ఐపీఓ ద్వారా రూ. 10 వేల కోట్ల వరకు నిధుల సమీకరణకు కంపెనీ సిద్దంగా ఉంది. దీనికి సెబీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Next Story