- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Modi: బంగారం కొనొద్దన్న ప్రధాని మోదీ వ్యాఖ్యల వెనుక కారణాలేంటి?
భారత ఆర్థికవ్యవస్థను పరిరక్షించడం గురించే ఆయన చేసిన విజ్ఞప్తి చేశారనే అభిప్రాయం విశ్లేషకుల వినిపిస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడాది పాటు బంగారం కొనడం మానుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలకు చాలా మంది ఆశ్చర్యపోయారు. పెళ్లిళ్లు, పండుగలు, పొదుపు, సంప్రదాయాలతో బంగారం ముడిపడి ఉన్న దేశంలో, ఆ ప్రకటన అందరినీ షాక్‌కు గురి చేసింది. కానీ ప్రధాని మోదీ విజ్ఞప్తి నిజానికి బంగారు ఆభరణాల గురించి కాదు. ప్రస్తుతం మనదేశం వివిధ రిస్క్‌తో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో, భారత ఆర్థికవ్యవస్థను పరిరక్షించడం గురించే ఆయన విజ్ఞప్తి చేశారనే అభిప్రాయం విశ్లేషకుల వినిపిస్తోంది.
చమురు షాక్, బలహీన రూపాయితో ఒత్తిడి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ మరింత ఒత్తిడిలోకి వెళ్తోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. బ్యారెల్‌కు సుమారు 70 డాలర్ల వద్ద ఉన్న చమురు ధరలు ఇటీవల 120 డాలర్లకు చేరువయ్యాయి. ఇదే సమయంలో భారత రూపాయి కూడా బలహీనపడుతూ డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్టాల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు 'ఒక సంవత్సరం పాటు బంగారం కొనడం తగ్గించండి' అని విజ్ఞప్తి చేశారు. నిజానికి ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది బంగారం గురించి కాదు, బంగారం కోసం మనం చెల్లిస్తున్న డాలర్ల గురించి. మన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం, బంగారం 90 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. అదే సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు దిగుమతిదారులలో కూడా మనదేశం ఒకటి. ఈ రెండింటికీ డాలర్లలోనే చెల్లించాల్సి రావడంతో విదేశీ మారక నిల్వలపై అధిక ఒత్తిడి ఉంది.
మనదేశం ఎగుమతులు, ఐటీ సేవలు, విదేశీ పెట్టుబడులు, రెమిటెన్సుల ద్వారా డాలర్లు సంపాదిస్తున్నాం. కానీ చమురు, బంగారం దిగుమతుల వల్ల బయటకు వెళ్తున్న డాలర్లు ఎక్కువైతే కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుంది. దాంతో రూపాయి మరింత బలహీనపడుతుంది. రూపాయి బలహీనపడటం అంటే కేవలం కరెన్సీ విలువ తగ్గడమే కాదు. దేశానికి దిగుమతుల ఖర్చు భారీగా పెరగడం కూడా. ఉదాహరణకు బ్యారెల్ చమురు ధర 100 డాలర్లే అయినా, డాలర్ విలువ రూ. 80 నుంచి రూ. 95కు పెరిగితే భారత్ అదే చమురుకు బ్యారెల్‌పైన రూ. 1,500 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇదే ప్రభావం ఎలక్ట్రానిక్స్, మందులు, యంత్రాలు, ఎరువులు, వంట నూనెలు, విమాన టిక్కెట్లు వంటి అనేక రంగాలపై పడుతుంది. చివరికి ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడి ఖర్చులు కూడా అధికమవుతాయి.
2013 నాటి సంక్షోభం
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 'అనవసర డాలర్ వ్యయం' తగ్గించాలని ప్రయత్నిస్తోంది. బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు, అధిక ఇంధన వినియోగం వంటి అంశాలపై మోదీ చేసిన వ్యాఖ్యల వెనుక ఇదే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2013లో కూడా, పెరుగుతున్న చమురు, బంగారం దిగుమతుల కారణంగా భారత్ తీవ్రమైన రూపాయి సంక్షోభాన్ని ఎదుర్కొంది. అప్పుడు ప్రభుత్వం డాలర్ ఖర్చును నియంత్రించడానికి బంగారం దిగుమతులపై సుంకాలను భారీగా పెంచింది. ఈసారి అలాంటి కఠిన చర్యల జోలికి వెళ్లకుండా, ముందుగానే ప్రజలకు విజ్ఞప్తి చేయాలని ప్రభుత్వం చూస్తోంది. మార్కెట్లు కూడా దీన్ని ఆర్థిక ఒత్తిడికి సంకేతంగా చూస్తున్నాయి. అందుకే, ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత సోమవారం ట్రేడింగ్‌లో టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి జ్యువెలరీ కంపెనీల షేర్లు 4-9 శాతం మేర పడిపోయాయి.
మొత్తంగా చూస్తే, ప్రధాని మోదీ చేసిన 'బంగారం కొనొద్దు' విజ్ఞప్తి వెనుక అసలు ఉద్దేశం దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచ సంక్షోభం, పెరుగుతున్న చమురు ధరలు, బలహీన రూపాయి, పెరుగుతున్న దిగుమతి బిల్లులు కలిసి భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో విదేశీ మారక ద్రవ్యాన్ని జాగ్రత్తగా వినియోగించకపోతే పరిస్థితి మరింత క్లిష్టమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ప్రజల వినియోగపు అలవాట్లను కూడా ఆర్థిక భద్రతతో ముడిపెడుతోందని వెల్లడించారు.






