REEs: చైనా తీరుతో ప్రపంచ సరఫరాకు చిక్కులు

by S Gopi |

యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, చైనా ఇప్పటికీ ప్రపంచంలోని అరుదైన ఖనిజాలలో 60 శాతం ఉత్పత్తి చేస్తుంది.

REEs: చైనా తీరుతో ప్రపంచ సరఫరాకు చిక్కులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భూమి అంతర్భాగంలో లభించే అరుదైన ఖనిజాలపై చైనా దేశం నియంత్రణ విధించడంతో ప్రపంచ సరఫరాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తె సూచనలు కనిపిస్తున్నాయి. 2023, ఏప్రిల్ నుంచి చైనా ఇలాంటి నియంత్రణను అమలు చేస్తోంది. దీనివల్ల ఎలక్ట్రిక్ మోటార్లు, స్మార్ట్‌ఫోన్లు, రక్షణ రంగంలో వాడే కీలకమైన పదార్థాలకు ప్రత్యేక ఎగుమతి లైసెన్సులు కోరుతోంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ, యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, చైనా ఇప్పటికీ ప్రపంచంలోని అరుదైన ఖనిజాలలో 60 శాతం ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచ శుద్ధిలో 90 శాతాన్ని నియంత్రిస్తుంది. దీనివల్ల ప్రపంచ సరఫరాపై చైనా ఆధిపత్యం కలిగి ఉంటుంది.

చైనాయే ఎందుకంత ముఖ్యం

సమేరియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, లుటేటియం, స్కాండియం, యట్రియం వంటి కీలక మూలకాలను ఎలక్ట్రిక్ మోటార్లు, బ్రేక్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఏరోస్పేస్ భాగాలు, క్షిపణి వ్యవస్థలలో ఉపయోగిస్తారు. వాటి తయారీలో ఈ మూలకాలే కీలకపాత్ర పోషిస్తాయి. చైనా అమలు చేస్తున్న పరిమితుల వల్ల ప్రపంచ సరఫరాలో జాప్యం కారణంగా అనేక పరిశ్రమలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దీన్ని నివారించేందుకు, ఎగుమతి లైసెన్సులను వేగవంతం చేయడానికి భారత్ సహా జపాన్, యూరప్ దేశాల ప్రతినిధులు తక్షణమే చైనా అధికారులతో మాట్లాడాలని, దౌత్య ప్రయత్నాలు చేయాలని పరిశ్రమలు కోరుతున్నాయి. జూన్‌లో జపాన్ ఓ బృందాన్ని బీజింగ్‌కు పంపుతోంది. యూరోపియన్ దౌత్యవేత్తలు అత్యవసర సమావేశాల కోసం చూస్తున్నారు. పరిస్థితిని త్వరగా పరిష్కరించకపోతే, వాహన ఉత్పత్తి ఆగిపోవచ్చని జర్మన్ కార్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.

భారత్‌పై ప్రభావం

ప్రపంచంలో మూడవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్‌కు ఈ పరిస్థితి అతిపెద్ద ప్రమాదాలలో ఒకటి. మారుతి సుజుకి, బజాజ్ ఆటో వంటి స్థానిక కార్ల తయారీ కంపెనీలు ఇప్పటికే తమ సరఫరాను తగ్గించాయి. ఎందుకంటే ఈ కంపెనీల ఈవీ వాహనాలతో పాటు ఎగుమతి అయ్యే కార్ మోడళ్లలో చాలా వరకు చైనా నుంచి వచ్చే అయస్కాంత మూలకాలపై ఆధారపడ్డాయి. దీని పరిష్కారానికి సియామ్, ఆటోమోటివ్ కాంపోనెంట్ తయారీదారుల సంఘం (ఏసీఎంఏ) వంటి పరిశ్రమ సంఘాలు లైసెన్సులను వేగవంతం చేయడానికి చైనాకు ప్రతినిధి బృందాన్ని పంపేందుకు సిద్ధమవుతున్నాయి.

గ్లోబల్ చిక్కులు

అరుదైన భూమి ఖనిజాల దిగుమతుల్లో 61 శాతానికి పైగా చైనాపై ఆధారపడిన యునైటెడ్ స్టేట్స్, ఈ పరిణామాల వల్ల కీలక రంగాలలో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. టెస్లా, జనరల్ మోటార్స్ వంటి పెద్ద కార్ల కంపెనీలు ఆలస్యం వల్ల ఉత్పత్తి ఆగిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. అమెరికా ఏకైక అరుదైన గని, మౌంటైన్ పాస్, ఇప్పటికీ ప్రాసెసింగ్ కోసం చైనాపై ఆధారపడి పనిచేస్తోంది. జపాన్, యూరప్ వంటి దేశాలు కూడా ఒత్తిడిని అనుభవిస్తున్నాయి. చైనా నుండి 60 శాతం అరుదైన మూలకాలను దిగుమతి చేసుకునే జపాన్, ఆధారపడటాన్ని తగ్గించడానికి ఆస్ట్రేలియాలోని లినాస్ రేర్ ఎర్త్స్‌లో పెట్టుబడి పెడుతోంది. యూరప్ చైనా అరుదైన ఖనిజాలపై ఆధారపడటాన్ని 98 శాతం నుంచి 46.3 శాతానికి తగ్గించగలిగింది, కానీ ప్రస్తుత నిల్వలు 2025 ప్రథమార్థం వరకు మాత్రమే ఉంటాయని అంచనా.

Next Story